
ఇండోనేషియా ప్రసిద్ధ పర్యాటక దీవి బాలిలో పవిత్ర హిందూ పండుగ ‘న్యేపి’ (Nyepi – డే ఆఫ్ సైలెన్స్) ని నిందించిన వ్యవహారంలో ఒక 26 ఏళ్ల స్విస్ పర్యాటకుడికి ఏడాది జైలు శిక్ష విధించారు. డెన్‌పసార్ కోర్టు అతడిని సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియో పోస్ట్ చేయడం, బాలి ధార్మిక సంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంలో దోషిగా నిర్ధారించింది.
న్యేపి అనేది బాలి హిందూ సమాజానికి అత్యంత ముఖ్యమైన పండుగ రోజు. ఈ రోజున దీవి అంతటా ప్రశాంతత, ఆత్మపరిశీలన వాతావరణం ఉంటుంది. ప్రజలు ఇళ్లలోనే ఉంటారు. పని, వినోదం, రకరకాల బయటి కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. ఈ సమయంలో రహదారులు, సముద్ర తీరాలు పూర్తిగా విజనంగా కనిపిస్తాయి. బాలి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నిర్ణీత సమయం వరకు మూసివేస్తారు.
కోర్టులో తెలిపిన వివరాల ప్రకారం, సదరు పర్యాటకుడికి హోటల్ సిబ్బంది న్యేపి నియమ నిబంధనల గురించి ముందే సమాచారం అందించారు. అయినప్పటికీ అతడు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో అతడు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపించాడు. బీచ్‌కి వెళ్లినట్లు చెబుతూ, న్యేపి సంప్రదాయానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించాడు.
వీడియో వైరల్ కావడంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో మార్చి నెలలో ఆ పర్యాటకుడిని అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు కోర్టుకు క్షమాపణలు చెబుతూ, తనకు నిబంధనల తీవ్రత సరిగ్గా అర్థం కాలేదని పేర్కొన్నాడు. పవిత్రమైన రోజున ఆహారం లభించకపోవడం వల్ల ఆకలితో, విసుగుతో ఆ వీడియో పోస్ట్ చేసినట్లు చెప్పాడు. బాలి ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసినందుకు విచారం వ్యక్తం చేశాడు.
న్యాయమూర్తి జొకోర్డ పుత్ర బుడి పాస్తిమా మాట్లాడుతూ, నిందితుడి ప్రవర్తన వల్ల స్థానికుల మతపరమైన భావాలు దెబ్బతిన్నాయని, సమాజంలో ఆగ్రహం వ్యక్తమైందని పేర్కొన్నారు. అందుకే అతడు చేసిన పనికి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నిందితుడు ఇప్పటికే దాదాపు ఐదు నెలల సమయం జైలులో గడిపాడు. ఈ సమయం అతడి శిక్షాకాలంలో మినహాయించబడుతుంది. స్విట్జర్లాండ్ అధికారులు కూడా తమ పౌరుడికి అవసరమైన దౌత్య సహాయం అందిస్తున్నట్లు ధృవీకరించారు.




