
ముంబైలో గణేశుడి ఆగమన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మజ్‌గావ్ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని మండపానికి తీసుకువస్తున్న సమయంలో శోభాయాత్రపై ఓ భవనం నుంచి గుడ్లు విసిరినట్లు ఆరోపణలు రావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గణపతి మండలి డిప్యూటీ సెక్రటరీ వివేక్ రాణే తెలిపిన వివరాల ప్రకారం.. గణేశుడి ఆగమన శోభాయాత్ర మండపానికి సమీపంలోకి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మండపానికి సుమారు 30 నుంచి 40 మీటర్ల దూరంలో ఉన్న ఓ భవనం పైనుంచి కొందరు శోభాయాత్రపై గుడ్లు విసిరినట్లు ఆయన పేర్కొన్నారు. వాటిలో కొన్ని గుడ్లు గణేశుడి విగ్రహంపై పడ్డాయని సమాచారం.
ఈ విషయం తెలియడంతో స్థానికులు, హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆ భవనం వద్దకు చేరుకున్నారు. గణేశుడి విగ్రహంపై గుడ్లు విసరడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంటూ.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టడంతో పాటు అనుమానిత భవనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముంబైలో 10,000కు పైగా గణేశ్ మండపాలు
మహారాష్ట్రలో ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ముంబైలో సుమారు 10,600 పబ్లిక్ గణేశ్ మండళ్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో దాదాపు 2,500 మండళ్లు 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతులు పొందాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఈసారి దాదాపు 28 లక్షల గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు అంచనా. ఉత్సవాల సందర్భంగా పండళ్ల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ముంబైలో ఆన్‌లైన్ సింగిల్ విండో వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా బీఎంసీతో పాటు పోలీసు, ట్రాఫిక్ విభాగాల నుంచి అవసరమైన ఎన్‌వోసీలను ఆన్‌లైన్‌లో పొందే అవకాశం కల్పించారు.
పండల్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 13 వరకు గడువు ఉంది. ఈసారి ముంబైలోని పలు గణేశ్ మండళ్లు భక్తులను ఆకట్టుకునేలా విభిన్న థీమ్‌లతో పందిళ్లను సిద్ధం చేస్తున్నాయి.




