News

‘పాక్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ మళ్లీ భారత్‌లో భాగమవుతాయి’- రాందేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

6views

రాయపూర్‌: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ భవిష్యత్తులో మళ్లీ భారత్‌లో భాగమయ్యే రోజు వస్తుందని యోగా గురువు బాబా రాందేవ్‌ అన్నారు. ఇందుకోసం ప్రజలు ఓపికగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌కు చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో హిందువులపై అన్యాయం, వేధింపులు జరుగుతున్నాయని రాందేవ్‌ అన్నారు. ఆధునిక నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలకు చోటు ఉండకూడదని పేర్కొన్నారు. ఏ మతానికీ భారత్‌లో ముప్పు లేదని, హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాల కంటే దేశ గౌరవం, ప్రతిష్ఠను కాపాడటం ముఖ్యమని వ్యాఖ్యానించారు.

మతంతో పాటు విద్య, వైద్యం, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం తదితర రంగాల్లో అవకతవకలు లేకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని రాందేవ్‌ అన్నారు. ఈ వ్యవస్థలను మరింత సమర్థంగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై స్పందన
తనను ‘దిమాగీ నక్సలైట్‌’గా పేర్కొంటూ పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలపైనా రాందేవ్‌ స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశంలో మేధో అరాచకానికి దారితీస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని, అయితే ఆ స్వేచ్ఛను రాజ్యాంగ, ప్రజాస్వామ్య, నైతిక పరిమితుల్లో వినియోగించాలని సూచించారు. హక్కులతో పాటు బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు.

‘సనాతన ధర్మంలో లోపం లేదు’
సనాతన ధర్మం, సంస్కృతి ఎంతో ప్రాచీనమైనవని రాందేవ్‌ పేర్కొన్నారు. గతంలో బలవంతం, ప్రలోభాలు, అపోహల ద్వారా మత మార్పిడులు జరిగినట్లు ఆరోపించారు. అదే సమయంలో సనాతన ధర్మంలో సామాజిక వివక్ష, అంటరానితనం, అసమానతలపై వచ్చిన విమర్శలను ప్రస్తావించారు.

ధర్మంలో సహజంగానే లోపం లేదని, కొందరి తప్పుడు ఆలోచనలు, ఆచరణ వల్లే సామాజిక వివక్షకు అవకాశం ఏర్పడిందని అన్నారు. సనాతనిగా ఉండటం అంటే కేవలం ఒక మతాన్ని అనుసరించడం కాదని, శ్రీరాముడి మర్యాద, శ్రీకృష్ణుడి యోగం–కర్మ సిద్ధాంతం, శివుడికి సంబంధించిన పవిత్రత, సత్యాన్ని జీవితంలో ఆచరించడమే సనాతన విలువల సారమని రాందేవ్‌ పేర్కొన్నారు.