
(శ్రావణ శుక్త సప్తమి – తులసీదాస్ జయంతి)
గోస్వామి తులసీదాస్ తన మహాకావ్యాన్ని సాధారణ ప్రజల భాషలో రచించడం ద్వారా ఆధ్యాత్మిక సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించారు. సాధారణంగా హిందూ ధార్మిక గ్రంథాలన్నీ సంస్కృతంలో రాస్తుండే సమయంలో తులసీదాస్ మాత్రం సామాన్య ప్రజలు మాట్లాడుకునే అవధీలో రామచరితమానస్ రచించారు. ఆ రచనే శ్రీరామచంద్ర భగవానుణ్ణి కోట్లాదిమంది భక్తులకు చేరువ చేసింది. తులసీదాస్ రాసిన 12 గ్రంథాలూ భక్తిసాహిత్యానికి మూలస్తంభంగా నిలిచాయి.
1497లో ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో పుట్టిన తులసీదాస్ అసలుపేరు రాంభోలా. బాబా నరహరిదాస్ అనే ఆధ్యాత్మిక గురువు రాంభోలాను కాశీలో పెంచి పెద్ద చేసారు. వేదాలు, జ్యోతిషం, తత్వశాస్త్రాల్లో ఏళ్ళ తరబడి కఠోరమైన శిక్షణ పొందిన తులసీదాస్, భౌతిక ప్రపంచపు సంబంధాలు అన్నింటినీ వదిలేసుకుని రామభక్తికే తన జీవితాన్ని అంకితం చేసారు. తులసీదాస్ విస్తృతంగా దేశమంతా పర్యటించి, హిందూసమాజం ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక, సామాజిక సమస్యలను అర్ధం చేసుకున్నారు. అందుకే ఆయన రామచరితమానస్‌లో రామరాజ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. శాంతి, సమృద్ధి, నైతిక ప్రవర్తనలతో కూడిన ఆదర్శ రాజ్యమే తులసీదాస్ స్వప్నించిన రామరాజ్యం. భిల్లజాతి మహిళ శబరి, గిరిజన రాజు నిషాదుడు, రావణుడి సోదరుడు విభీషణుడు వంటి పాత్రల ద్వారా తులసీదాస్ సామాజిక సమరసతను చాటిచెప్పారు.
తులసీ రామాయణంలో రాముడు ఆదర్శ పుత్రుడు, సోదరుడు, భర్త, పరిపాలకుడు. ఆ రాముడు భారతీయ కుటుంబ వ్యవస్థపై చెరగని ముద్ర వేసాడు. రామచరితమానస్‌లోనూ, అంతకంటె ఎక్కువగా ప్రపంచ ప్రఖ్యాతి గడించిన హనుమాన్ చాలీసాలోనూ ప్రతిఫలించే ఆదర్శాలు ఒక్క భారతదేశంలోనే కాక మారిషస్, ట్రినిడాడ్, ఫిజీ తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయుల్లోనూ నైతిక సాంస్కృతిక విలువలను పెంచి పోషించాయి.
తులసీదాస్ కేవలం ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, ఆయన ఆధ్యాత్మిక ప్రభావం ప్రధానంగా మొగల్ పరిపాలకుల పైనా చూపించింది. అక్బర్ స్వయంగా ఆహ్వానించినా తిరస్కరించిన తులసీదాస్, రాజా తోడర్‌మల్ ప్రతిపాదించిన మునసబు ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా కాదన్నారు. రాజాస్థానాల ఆహ్వానాలను సైతం త్రోసిపుచ్చారు. ‘రఘువీరుడి సేవకుడైన తులసీదాస్‌కు భౌతికలోకంలో ప్రయోజనాలు దేనికి’ అంటూ తన దోహాలో నిలదీసారు. రాముడిపై తులసీదాస్ అనన్యభక్తికి నిదర్శనం ఆ సంఘటన. అంతేకాదు, తులసీదాస్‌కు బంగారం కానుకగా ఇద్దామనుకున్న జహంగీర్ ప్రయత్నాలు సైతం ఫలించలేదంటే ఆయన నిబద్ధత అర్థమవుతుంది.
ఇస్లామిక్ పాలకులు హిందూ సాంస్కృతిక, ధార్మిక అంశాలను అణచివేస్తున్న వేళ తులసీదాస్ కవిత్వం సగటు భారతీయ ప్రజల్లో కొత్త ఆశలను, విశ్వాసాన్నీ ప్రోదిచేసింది. ధర్మం క్షీణించి రాక్షసశక్తులు పెచ్చుమీరినప్పుడు అధర్మాన్ని నాశనం చేయడం కోసం భగవంతుడి అవతారాలు భూమిమీదకు వస్తాయని ధైర్యం కలిగించింది.
భారతీయులపై తులసీదాస్ అసాధారణ ప్రభావాన్ని చరిత్రకారులు గుర్తించారు. బ్రిటిష్ చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ తన ‘అక్బర్ ది గ్రేట్ మొగల్’ అనే గ్రంథంలో, రాజుల సేనలు సాధించిన విజయాల కంటె తులసీదాస్ ఆధ్యాత్మిక అన్వేషణ గొప్పదనీ, ఆ తరంలో తులసీదాసే మహానుభావుడనీ రాసాడు. ఇంగ్లండ్‌లో బైబిల్ కంటె ఉత్తర భారతదేశంలో రామచరితమానస రచనే ఎక్కువమందికి తెలుసునని భాషావేత్త జార్జి గ్రియర్‌సన్ స్పష్టం చేసాడు.
తులసీదాసు వారసత్వం భారతదేశపు సాంస్కృతిక ఆధ్యాత్మిక చైతన్యంపై గొప్ప ప్రభావం చూపింది. ఆధ్యాత్మికత, సామాజిక న్యాయం, దైవిక సార్వభౌమత్వాల గురించి తులసీదాస్ ఇచ్చిన సందేశాలు ఆధునిక ప్రపంచంలో నైతిక స్పష్టతకు మార్గదర్శకాలుగా, నేటికీ కోట్లాదిమందికి ప్రేరణగా నిలుస్తున్నాయి, భారతీయ ధర్మానికీ, ఐకమత్యానికీ కాలాతీత మార్గదర్శిగా తులసీదాస్ చిరస్మరణీయుడు.





