News

‘జనగణమన’ స్థానంలో వందేమాతరం రావాలి : నటుడు ముఖేష్ ఖన్నా

5views

ముంబై: 90వ దశకంలో ‘శక్తిమాన్’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుత జాతీయ గీతం ‘జన గణ మన’ స్థానంలో ‘వందేమాతరం’ను అధికారిక జాతీయ గీతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘జన గణ మన’ బ్రిటీష్ రాణిని కీర్తిస్తూ రాసిన గీతమని ఆయన ఆరోపించారు.

ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడిన ముఖేష్ ఖన్నా.. ‘వందేమాతరం’ను జాతీయ గీతంగా చేయాలని తాను మూడేళ్ల క్రితమే చెప్పినట్లు తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ రాణి ఎలిజబెత్‌ను ప్రశంసిస్తూ ‘జన గణ మన’ రాశారని ఆయన పేర్కొన్నారు.

“‘జన గణ మన’ను మనం జాతీయ గీతంగా స్వీకరించాం. అందులోని భాగ్యవిధాత, పంజాబ్, సింధ్ వంటి ప్రస్తావనలు మనకు సంబంధించినవి కావు. కానీ ‘వందేమాతరం’ పూర్తిగా మనది. లతా మంగేష్కర్ ఆ గీతాన్ని ఎంతో అద్భుతంగా ఆలపించారు” అని ముఖేష్ ఖన్నా వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా తాను ‘వందేమాతరం’పై సుమారు ఏడు నిమిషాల నిడివి గల ప్రత్యేక గీతాన్ని రికార్డ్ చేసినట్లు చెప్పారు. ఆ పాటను మరో ఆరు నెలల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

‘జన గణ మన’ స్థానంలో వందేమాతరం రావాలి
“వీలైనంత త్వరగా ‘జన గణ మన’ను తొలగించి, ‘వందేమాతరం’ను తీసుకురావాలి. ప్రతి పాఠశాలలో, ప్రతి కార్యక్రమంలో ‘వందేమాతరం’ను తప్పనిసరి చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం” అని ముఖేష్ ఖన్నా అన్నారు.