News

పశ్చిమ బెంగాల్‌లో మదర్సా ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ పిటిషన్లు కొట్టివేత

7views

 

కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని గుర్తింపు పొందిన మదర్సాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది దాఖలు చేసిన క్రమబద్ధీకరణ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్-ఇన్-ఎయిడ్ పథకం కింద తమ నియామకాలకు గుర్తింపు ఇవ్వాలని, వేతనాలు చెల్లించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లలో ఎలాంటి చట్టపరమైన ఆధారం కనిపించలేదని ధర్మాసనం పేర్కొంది.

జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి. మసీహ్‌లతో కూడిన ధర్మాసనం, గత ఆదేశాల మేరకు 350 మందికి పైగా పిటిషనర్లలో ప్రభావితమైన 13 మంది కేసులను ముందుగా పరిశీలించింది. ఈ కేసుల్లో ఎవరూ తమ నియామకాలు చట్టబద్ధమైనవని లేదా ఉపశమనం పొందేందుకు తగిన ఆధారాలను సమర్పించలేకపోయారని కోర్టు స్పష్టం చేసింది.

ధర్మాసనం, “ఈ 13 మంది పిటిషనర్లలో ఎవరైనా తమ వాదనలతో కోర్టును ఒప్పించగలిగితే, మిగిలిన కేసులను కూడా పరిశీలించాలని భావించాము. అయితే అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. అందువల్ల ఈ 13 మంది మాత్రమే కాకుండా, మిగిలిన పిటిషనర్లందరి రిట్ పిటిషన్లను కూడా కొట్టివేస్తున్నాము” అని పేర్కొంది.

ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌లోని వివిధ మదర్సాలలో ఉపాధ్యాయులు లేదా బోధనేతర సిబ్బందిగా పనిచేస్తున్నట్లు పేర్కొంటూ సుమారు 361 మంది దాఖలు చేసిన 40కి పైగా రిట్ పిటిషన్లు ఉన్నాయి.

ఈ వివాదానికి మూలం పశ్చిమ బెంగాల్ మదర్సా సర్వీస్ కమిషన్ చట్టం–2008. గుర్తింపు పొందిన మదర్సాలలో ఉపాధ్యాయుల నియామకాలకు ఈ చట్టం ప్రకారం కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే, 2014లో కలకత్తా హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేయగా, 2015లో డివిజన్ బెంచ్ కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది.

తదనంతరం 2016లో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. అనంతరం 2020లో ఎస్.కె. మహమ్మద్ రఫిక్ వర్సెస్ మేనేజింగ్ కమిటీ, కాంటాయ్ రహమానియా హై మదర్సా కేసులో 2008 చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

అయితే, 2015 హైకోర్టు తీర్పు నుంచి 2020 సుప్రీంకోర్టు తీర్పు మధ్య జరిగిన నియామకాల చెల్లుబాటుపై వివాదం కొనసాగింది. దీనిపై విచారణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన కమిటీ, ఆ కాలంలో జరిగిన నియామకాలు చెల్లవని తన నివేదికలో తేల్చింది.

కమిటీ నివేదికను సవాలు చేస్తూ బాధిత ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగుతున్న సమయంలో 2024లో వారి ఉద్యోగాలను తాత్కాలికంగా కొనసాగించేందుకు, 2025లో వాస్తవంగా బోధన చేస్తున్న వారికి జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అయితే తుది విచారణ అనంతరం కమిటీ నిర్ణయాన్ని సమర్థిస్తూ అన్ని పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.