
భౌతికంగా సుప్రసిద్ధ గాయని ఎస్. జానకి మన మధ్య లేకపోయినా ఈ జగత్తు ఉన్నంతకాలం ఆవిడ పాట మారుమ్రోగుతూనే ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడలోని దుర్గాపురంలో ఘంటసాల వెంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాన కోకిల శ్రీమతి ఎస్. జానకి గారి స్మృత్యంజలి కార్యక్రమంలో మరియు కేంద్ర సంగీత నాటక అకాడమీ, భారత, ఏపీ ప్రభుత్వాల సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వందేమాతరం 150 సంవత్సరాల పండుగ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి గోకరాజు లైలా గంగరాజు కళా వేదికపై ఏర్పాటు చేసిన ప్రముఖ గాయని ఎస్. జానకి చిత్ర పటానికి పూలమాల వేసి మంత్రి దుర్గేష్ ఘన నివాళులు అర్పించారు..అదే విధంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… మహోన్నతమైన ‘వందేమాతరం’ గీతం ఆలపించడం ప్రారంభించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ గీత విశిష్టతను మరియు చారిత్రక ప్రాశస్త్యాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు.బంకించంద్ర చటర్జీ కలం నుండి జాలువారిన వందేమాతరం గీతం స్వాతంత్ర్య సమరంలో కోట్ల మందిలో దేశభక్తిని రగిలించిందని ఆయన గుర్తుచేశారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగాల ఫలితమేనని మంత్రి పేర్కొన్నారు..
ఈ వేడుకల్లో భాగంగా మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి. నరసింహారావు రచించిన నాటిక ఆధారంగా… దర్శకుడు ఫణీంద్ర, ఎమ్.ఎస్. చౌదరిల నేతృత్వంలో రూపొందించిన “అమరావతికి ఆమడ దూరంలో వందేమాతరం గర్జన” అనే సాంఘిక నాటకాన్ని మంత్రి తిలకించి, ప్రదర్శనను ఎంతగానో అభినందించారు. ఇలాంటి వైవిధ్యభరితమైన కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా జాతీయతను పెంపొందించడం మరియు యువతలో దేశభక్తిని రగిలించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ సగర్వంగా ‘వందేమాతరం’ అని నినదించారు.రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలల్లో సైతం ఇలాంటి దేశభక్తి పూరిత కార్యక్రమాలను విస్తృతంగా ప్రదర్శించి, నేటి తరానికి స్ఫూర్తిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం, కేంద్ర ప్రభుత్వ పురస్కార గ్రహీత గుమ్మడి గోపాలకృష్ణను, కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు శ్రీమతి ఎస్.పి. భారతిని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. సంగీతం, నాటకం మరియు లలిత కళల ద్వారా సమాజంలో జాతీయ భావాన్ని, దేశభక్తిని మరింత బలంగా పెంపొందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.





