News

విత్తన బంతులతో సహజ అడవుల పునరుద్ధరణ

35views

సీడ్‌ బాల్స్‌ విత్తన బంతులు ద్వారా సహజ అడవుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్‌ రెడ్డి తెలిపారు. జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెం, కనకాపురంలో ఉన్న అటవీ శాఖ నర్సరీలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడం, సహజ అడవుల పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యాలతో రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో సీడ్‌ బాల్స్‌ చల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే కనకాపురం వనసంరక్షణ సమితి (వీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. సీడ్‌ బాల్స్‌ తయారీలో నేరేడు, చింత, రావి, వేప వంటి స్థానిక వృక్షజాతుల విత్తనాలను వినియోగించడం జరిగిందన్నారు. వర్షపునీరు అందిన తర్వాత సీడ్‌ బాల్స్‌ క్రమంగా కరిగి అందులోని విత్తనాలు మొలకెత్తి సహజ పద్ధతిలో మొక్కలుగా అభివృద్ధి చెందుతాయని డీఎఫ్‌ఓ చెప్పారు. ఈ విధానం సహజ పునరుత్పత్తిని వేగవంతం చేసి అడవుల సాంద్రత పెంపుకు గణనీయంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సబ్‌–డీఎఫ్‌ఓ వెంకట సుబ్బయ్య, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ దుర్గాకుమార్‌ బాబు, సెక్షన్‌ ఆఫీసర్‌ కె.రాంబాబు, బీట్‌ ఆఫీసర్లు మారేష్‌, ఏసుపండు, రాము, ప్రొడక్షన్‌ హెల్పర్లు రమేష్‌, పాపారావు, రామ్‌ ప్రకాష్‌, వీఎస్‌ఎస్‌ సభ్యులు పాల్గొన్నారు.