
కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ కగార్’’ తో నక్సలిజం కకావికలమైంది. చాలా మంది నక్సల్స్ అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మరి కొందరు లొంగిపోయారు. మిగిలిన నక్సల్స్ కూడా లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో భారత్ లో నక్సలిజం చాలా మట్టుకు కాలగర్భంలో కలిసిపోయినట్లే లెక్క.
మరీ ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో కూడా నక్సలిజం కొనఊపిరిలోనే వుండిపోయింది. దీంతో గతంలో నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు కూడా నక్సలైట్ అంటే భయం లేకుండా, నిర్భీతిగా తిరుగుతున్నారు.అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి. చాలా మంది అర్హులు వాటిని వినియోగించుకుంటున్నారు. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విద్యుత్, రోడ్ల లాంటి మౌలిక సదుపాయాలు వచ్చేశాయి. దీంతో అభివృద్ధి వేగంగా విస్తరిస్తోంది.
ఈ క్రమంలోనే బస్తర్ అంతటా నక్సల్ హింస తగ్గుముఖం పట్టింది. దీంతో నిర్వాసిత కుటుంబాలు తిరిగి తమ సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారు. దీంతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వారికి పునరావాసాన్ని, మౌలిక వసతులను కల్పించడానికి వేగంగా పనిచేస్తోంది.
వస్తున్న కుటుంబాలు గౌరవంగా, భద్రతతో తమ జీవితాలను తిరిగి నిర్మించుకునేలా చూసేందుకు, రోడ్డు రవాణా సౌకర్యాలు మరియు ఇతర అత్యవసర సేవలపై దృష్టి సారిస్తోంది. అందుకు సంబంధించిన పనులు వేగంగా చేస్తున్నారు.
అక్కడ నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు, భయం లేదా ఇతర కారణాల వల్ల అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఇప్పుడు ఈ జిల్లా మరియు మొత్తం బస్తర్ ప్రాంతం నక్సల్-రహితంగా మారుతుండటంతో ఆ కుటుంబాలు తిరిగి వస్తున్నాయి. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో నిరంతరం కృషి చేస్తోంది.
ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద నాలుగో దశ కింద ఇప్పటికే 236 కిలోమీటర్ల మేర రోడ్లు మంజూరు అయ్యాయి. అలాగే రెండో బ్యాచ్ కింద ఇప్పటికే 292 కిలోమీటర్ల రోడ్లకు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం అంగీకరించింది. నక్సల్స్ తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో ప్రజలు తిరిగి తమ స్వస్థాలకు చేరుకుంటున్నారు.
నక్సల్ హింస కారణంగా వలస వెళ్లిన అనేక కుటుంబాలు ఇప్పుడు ఆ గ్రామంలో తమ జీవితాలను తిరిగి నిర్మించుకుంటున్నామని స్థానికులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
“ప్రారంభంలో ఇక్కడ 107 కుటుంబాలు ఉండేవి. సుమారు 60 నుండి 70 కుటుంబాలు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయాయి, కానీ ఇప్పుడు అవి తమ సొంత గ్రామాలకు తిరిగి వచ్చాయి. పరిస్థితులు ఇప్పుడు బాగున్నాయి. ఇప్పటికే 30కి పైగా కుటుంబాలు తిరిగి వచ్చాయి. ప్రజలు తిరిగి వచ్చి తమ జీవితాలను మళ్లీ నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో నక్సలైట్ల వల్ల వారు నలువైపుల నుంచీ దాడులకు గురయ్యేవారు. అందుకే వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. వారికి వేరే చోట భూమి కూడా లేదు. కానీ పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. దీంతో ఇక్కడికే వస్తున్నారు’’ అని స్థానికులు పేర్కొన్నారు.





