News

పాడేరులో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం..

39views

పాడేరు:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ తిరుపల్లి యోగి మాట్లాడుతూ, విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ దశాబ్దాలుగా నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. నేటి విద్యార్థుల సంక్షేమంతో పాటు భవిష్యత్ తరాలకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఏబీవీపీ ఒక ఆదర్శవంతమైన విద్యార్థి సంస్థ అని, ప్రతి విద్యార్థి సంస్థలో చేరి విద్యార్థి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మహేష్, కళ్యాణ్, మత్స్యరాజు, ప్రదీప్, నారాయణ, సూర్య, మధు, దేవరాజ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.