News

తక్కువ వర్షాభావం నేపధ్యంలో… సరికొత్త విధానాన్ని రూపొందించిన బిహార్ రైతులు

33views

మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ముప్పు మరియు సాధారణం కంటే తక్కువ వర్షపాతం వంటివి భారతదేశవ్యాప్తంగా వరి సాగుకు సవాళ్లు విసురుతున్న తరుణంలో బిహార్ రైతులు సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. బీహార్ రైతులు తక్కువ నీరు, తక్కువ ఖర్చు మరియు తక్కువ శ్రమతో వరిని పండించే ఒక ఆధునిక సాగు పద్ధతిని రూపొందించారు.

ఇందులో ప్రత్యేకత ఏమిటంటే సంప్రదాయ వరి సాగులో మాదిరిగా ఇందులో పొలాలను దున్నాల్సిన అవసరం ఉండదు.నారుమడిలో నారు పెంచడం గానీ, నీటితో నిండిన పొలాల్లో నాటడం గానీ అవసరం లేదు. దానికి బదులుగా, వరి విత్తనాలను నేరుగా నేలలోనే విత్తుతారు, దీనివల్ల సాపేక్షంగా పొడిగా ఉన్న పొలాల్లో కూడా సాగు సాధ్యమవుతుంది.

పొలాల్లో ఉపయోగించే జీరో టిల్లేజ్ సీడ్ డ్రిల్, ఒకేసారి దుక్కి దున్ని విత్తనాలు నాటుతుంది. యంత్రంలోని ఒక భాగంలో విత్తనాలు ఉంటే, మరొక భాగంలో ఎరువులు ఉంటాయి. ఈ రెండింటినీ సరైన లోతులో, సరైన దూరంలో నేలలో ఉంచుతారు. రైతులు పొలాలను నిరంతరం నీటితో నింపకుండా, పరిమిత నీటిపారుదల ద్వారా నేలలో తేమ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.

రైతులు రుతుపవనాల రాకకు ముందే వరిని విత్తగలరు కాబట్టి, వారు సకాలంలో కురిసే వర్షాలపై తక్కువగా ఆధారపడతారు. కొందరు రైతులు ఆ ప్రాంతంలో గత రెండేళ్లుగా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇలా 40 ఎకరాల్లో వరిని కూడా సాగు చేశారు. ఈ విధానం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నీరు, శ్రమ కూడా ఆదా అవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, వర్షాలు కురవకపోయినా మంచి దిగుబడి లభిస్తుంది అని వివరించారు.

దుక్కి దున్నని పద్ధతి నీటి వినియోగాన్ని 30-40% వరకు తగ్గించగలదు. సాంప్రదాయ వరి సాగులో ఎకరానికి దాదాపు రూ. 10,000 ఖర్చుతో పోలిస్తే, సాగు ఖర్చులు కూడా ఎకరానికి సుమారు రూ. 3,000–5,000కు గణనీయంగా తగ్గుతాయి. కూలీల అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

సాంప్రదాయ వరి సాగులో నారుమడిని సిద్ధం చేయడం, పొలాలను నీటితో నింపడం, నారు నాటడం మరియు పంట కాలంలో చాలా వరకు నీటిని నిలుపుకోవడం వంటివి ఉంటాయి. కానీ.. ఈ నూతన పద్ధతి ద్వారా రైతుకు ఈ పనులేవీ చేయాల్సిన అవసరమే లేదు. సమయం కూడా చాలా ఆదా అవుతుంది.

సుమారు రూ. 25,000 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉండే ‘జీరో టిల్లేజ్’ (దున్నకుండా సాగు చేసే) యంత్రాలపై 40% వరకు రాయితీలు కల్పించడం ద్వారా కేంద్ర మరియు బీహార్ ప్రభుత్వాలు ఈ సాంకేతికతను ప్రోత్సహిస్తున్నాయి. ఈ పద్ధతిని అవలంబించేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు శిక్షణ కూడా ఇస్తున్నారు.