News

చెరువు తవ్వకాల్లో వెయ్యేళ్ల నాటి అరుదైన శివలింగం..

32views

ఏలూరు జిల్లా చింతలవల్లి గ్రామంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రామంలోని స్థానిక చెరువు తవ్వకాలలో వెయ్యి సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం లభ్యమైంది. చెరువులో పనులు చేస్తున్న కూలీలు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పురోహితులు, పండితులు ఈ శివలింగాన్ని నిశితంగా పరిశీలించి.. ఇది సుమారు 1000 ఏళ్ల క్రితం నాటి చోళులు లేదా కాకతీయుల కాలం నాటి చారిత్రక విశిష్టత కలిగిన లింగంగా నిర్ధారించారు.

పూర్వీకుల కథ నిజమైంది!
ఈ ప్రాంతంలో పూర్వం ఒక శివాలయం ఉండేదని, కాలక్రమేణా ఇక్కడి అర్చకులు వెళ్ళిపోయాక ఆ ఆలయం అంతర్థానమైందని ఇక్కడి పెద్దలు కథలుగా చెప్పుకునేవారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్థుల సంకల్పంతో చెరువులో ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని జేసీబీలతో తవ్వకాలు ప్రారంభించారు. మూడు సార్లు తవ్వేసరికే స్వామివారి శివలింగం నిలువెత్తుగా, ప్రతిష్ఠిత రూపంలో నిటారుగా దర్శనమివ్వడం  భక్తులను ఆకట్టుకుంది.

వైభవంగా ఆలయ నిర్మాణం – ప్రతిష్ఠోత్సవం
స్వామివారి లీలను గుర్తించిన ప్రముఖ పారిశ్రామికవేత్త కాటేపల్లి వెంకటేశ్వరరావు (కేవీ రావు)-లావణ్య దంపతులు  ముందడుగు వేశారు. ఈ పురాతన శివలింగం విశిష్టత పదిమందికీ తెలియాలనే ఉద్దేశంతో, సొంత నిధులతో అక్కడ అత్యంత సుందరమైన “శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి” ఆలయాన్ని నిర్మించారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, కన్నుల పండువగా నిర్వహించారు.

ఈ అద్భుతమైన శివాలయాన్ని, వెయ్యేళ్ల నాటి స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారధి దంపతులు సైతం ఈ ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ప్రతిష్ఠోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నసంతర్పణ (అన్నదానం) కార్యక్రమం నిర్వహించగా, వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.