News

రామనాథపురంలో శిలాయుగం ఆనవాళ్లు

37views

తమిళనాడులోని రామనాథపురంలో పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 5,000 ఏళ్ల నాటి సమాధి మట్టి కుండలు, ప్రత్యేక చిహ్నాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి మెగాలిథిక్ యుగం (బృహత్ శిలా యుగం) నాటివని భావిస్తున్నారు. ఈ చారిత్రక వస్తువుల గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం పదండి.

కాంపౌండ్ వాల్ కోసం గొయ్యి తవ్వుతుండగా
రామనాథపురం జిల్లాలోని వలసై, మానక్కులం గ్రామాల మధ్య ఉన్న అయ్యనార్, ధర్మ మునీశ్వరర్ ఆలయ ప్రాంగణంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం గుంత తవ్వుతున్నారు. అక్కడే ఈ సమాధి కుండలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని పెరుంగరునైకి చెందిన మారి, వేల్ మురుగన్ కలిసి రామనాథపురం పురావస్తు పరిశోధన సంస్థ అధ్యక్షుడు వి. రాజగురుకు తెలియజేశారు. రాజగురు వెంటనే సమాధి కుండలు బయటపడిన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు.

‘మూడు ఎకరాల్లో సమాధి కుండలు’
ఆలయ సమీపంలోని సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో సమాధి కుండలు పాతిపెట్టి ఉన్నట్లు గుర్తించామని వి. రాజగురు తెలిపారు. గుడి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి గొయ్యి తవ్వుతుండగా ఈ సమాధి కుండలు బయటపడ్డాయని చెప్పారు. అందులోని ఒక కుండలో మూడు కప్పులు, పళ్లెం, గిన్నె, ఒక కుంభం (ఆచారానికి సంబంధిత పాత్ర) ఉందన్నారు. ఇందులో చాలా పురాతన వస్తువులు నలుపు, ఎరుపు రంగులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇంకొన్ని పూర్తిగా ఎరుపు రంగులో ఉన్నాయని వివరించారు.

‘పురావస్తు శాఖ మరిన్ని తవ్వకాలు చేపట్టాలి’
“విక్రమపాండియపురంలోని రాజా కోవిల్ తిడల్ అని పిలుచుకునే ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో మట్టి పాత్రల ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మెగాలిథిక్ యుగంలో ఈ ప్రాంతం మానవుల నివాసంగా ఉండేదని ఇది సూచిస్తోంది. అదే సమయంలో ఆ సమాధి కుండలు ఉన్న వలసై, మానక్కులం ప్రాంతాలు స్మశానవాటికలుగా ఉండేవని అర్థమవుతోంది. పురావస్తు శాఖ ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే మరిన్ని చారిత్రక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మైదాన ప్రాంతాల్లో లభించిన చిన్నపాటి సమాధి కుండలు సాధారణంగా కొండ ప్రాంతాల్లో కనిపించే మెగాలిథిక్ స్మారక కట్టడాల కంటే పురాతనమైనవి. కాబట్టి ఇవి సుమారు 5,000 ఏళ్ల నాటివని అంచనా వేయవచ్చు” అని వి. రాజగురు అభిప్రాయపడ్డారు.

గతంలోనూ బయటపడ్డ సమాధి మట్టి కుండలు
అంతకుముందు 2018లో అయ్యనార్, ధర్మ మునీశ్వరర్ ఆలయానికి దక్షిణాన ఒక చెరువును తవ్వుతున్నప్పుడు కూడా ఇలాంటి సమాధి కుండలు బయటపడ్డాయి. పగిలిన టెర్రకోట (కాల్చిన మట్టి) పాత్రలు, మూతలపై కొన్ని చిహ్నాలు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. ఈ కుండలు ఎరుపు, నలుపు రంగులో ఉన్నట్లు గుర్తించారు. వీటిపై గుణకార గుర్తు, తలకిందులుగా త్రిశూలం, నిచ్చెన వంటి చిహ్నాలు కనిపించాయి.

బృహత్ శిలా యుగంలోని సంప్రదాయాలు ఏంటంటే?
మెగాలిథిక్ యుగంలో మృతుల సమాధులను గుర్తించడానికి పెద్ద రాళ్లను నిలబెట్టేవారు. అలాగే అదే కాలంలో ఇనుము కనుగొనడం వల్ల ఇనుప యుగం అని కూడా పిలుస్తారు. క్రీస్తు పూర్వం 4000-1500 వరకు ఉన్న కాలాన్ని బృహత్ శిలా యుగం అంటారు. పురనానూరు (ప్రాచీన తమిళ కవితా సంకలనం)లో ఈ కుండల గురించి, వాటి రంగు గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా ఈ కుండలను పాతిపెట్టిన అడవిని తాళి పెరుంగాడు (సమాధి కుండల విశాల అడవి) అని ఆ కవితా సంకలనంలో పేర్కొన్నారు.

బృహత్ శిలా యుగంలో చనిపోయిన వారి మృతదేహాలను నివాస ప్రాంతాలకు దూరంగా అడవుల్లో వదిలివేసేవారు. నక్కలు, గద్దలు వంటి జంతువులు, పక్షులు మాంసాన్ని తిన్న తర్వాత మిగిలిన ఎముకలను సేకరించేవారు. ఈ ఎముకలను, మృతులు ఉపయోగించిన వస్తువులను ఒక చిన్న సమాధి కుండలో ఉంచి, దానిని మూసివేసి పాతిపెట్టేవారు. ఈ సంప్రదాయం ఆ కాలం నాటి ప్రజల జీవనశైలిని తెలియజేస్తోంది. తర్వాతి కాలంలో పూర్తి మృతదేహాన్ని ఒక పెద్ద పాత్రలో ఉంచి పాతిపెట్టే పద్ధతి అమల్లోకి వచ్చింది.