
శ్రీవేంకటేశ్వరస్వామివారి క్షేత్రమైన తిరుమలలో ఆధ్యాత్మిక వనాలు, ఔషధ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి (ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
తిరుమలలోని జీఎన్సీ పార్క్, గీతా పార్క్, నామాల పార్క్‌తో పాటు పలు ఉద్యానవనాలను ఆయన పరిశీలించి ఉద్యానవన, అటవీ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని ఉద్యానవనాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే సనాతన ధర్మం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు సంబంధించిన పవిత్ర వృక్షాలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలను విస్తృతంగా పెంచేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతి సౌందర్యాన్ని అందించే విధంగా ఉద్యానవనాల అభివృద్ధి చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో టీటీడీ అటవీ విభాగం డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (డీసీఎఫ్) ఫణికుమార్ నాయుడు, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.





