విజయనగరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం

విజయనగర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలక ఘట్టమైన శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 10.47 గంటలకు సింహలగ్నంలో ఈ మహోత్సవాన్ని సింహాచలం దేవస్థానం వేదపాఠశాల పండితులు తాళ్లపూడి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతులు, వారి కుటుంబ సభ్యులు శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిఖర ప్రతిష్ఠకు సంబంధించిన పవిత్ర కలశాలను చేతబట్టి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి, అనంతరం ఆలయ శిఖరానికి చేరుకుని ప్రతిష్ఠించారు.
ఈ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం యాగశాలలో పూర్ణాహుతి, అగ్ని ప్రదక్షిణ, ప్రాణ ప్రతిష్ఠ, కుంభ దర్శనం, గో దర్శనం వంటి వైదిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో తొలి దర్శన భాగ్యం అశోక్ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు కుటుంబ సభ్యులకు లభించింది.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె. శిరీష, ఆలయ ప్రధాన అర్చకులు బంటుపల్లి వెంకటరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు.





