ArticlesNews

లోక సంచారం.. ధర్మ ప్రచారం

30views

నారదుడు అనగానే.. మహతి వీణను ధరించి, నారాయణ నామస్మరణ చేసే రూపం కళ్లముందు కదలాడుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ హరి నామాన్ని విడిచిపెట్టని భక్తశిఖామణి ఆ మహర్షి. ‘నారం దదాతి ఇతి నారదః’ అన్నారు. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడని అర్థం. ఆయన బ్రహ్మదేవుని మానస పుత్రుడు. మహాభారతం, అష్టాదశ పురాణాలు రాసినప్పటికీ అసంతృప్తితో బాధపడుతున్న వ్యాసుడు.. భాగవతం రచించేలా చేశాడు నారదమహర్షి.

ఎలాంటి లోపాలూ లేని అత్యుత్తముడు ఎవరైనా ఉన్నారా- అని వాల్మీకి అడిగినప్పుడు శ్రీరామచంద్రుడి గుణగణాలను వివరించి.. రామాయణ గాథ భూమిపై అవతరించటానికి కారకుడయ్యాడు. ధ్రువుడికి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని ఉపదేశించి- శ్రీమహావిష్ణువు దర్శనభాగ్యం పొందేలా చేశాడు. గర్భంతో ఉన్న హిరణ్యకశిపుని భార్యకు విష్ణు లీలలను బోధించటం వల్ల ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహా భక్తుడయ్యాడు. నారదుణ్ణి కలహకారకుడు అన్నారు కానీ.. ఆ కలహాలన్నీ లోకోపకారం కోసమేనని స్పష్టమవుతుంది. అనుక్షణం నారాయణ నామాన్ని జపించే నారదమహర్షి భక్తి అంటే ఏమిటో, ఎలా ఉండాలో లోకానికి తెలియజేశాడు. సంగీతంలో మహా జ్ఞాని నారదుడు.

త్యాగరాజస్వామికి నారదుడు సాక్షాత్కరించి ‘స్వరార్ణవం’ బహుకరించాడని, ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసిన తర్వాతే త్యాగయ్య- త్యాగబ్రహ్మ అయ్యాడని, అబ్బురపరిచే అసంఖ్యాక కీర్తనలు రచించాడని పౌరాణిక కథలు తెలియజేస్తున్నాయి. ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించి.. ఒకసారి అన్నమాచార్యులు తిరుమలకు బయల్దేరారు. అలిపిరి దగ్గరకు రాగానే ఎందుకో ముందుకు వెళ్లలేక మెట్లపైనే ఆగిపోయారాయన. నారదుడు వృద్ధ బ్రహ్మణుడి రూపంలో అన్నమయ్య వద్దకు వచ్చి.. ‘హరినామ సంకీర్తన ఆరంభించు.. ఆ స్వామి నీ వెంటే ఉంటాడు’ అని ఆశీర్వదించి తంబురను వరప్రసాదంగా ఇచ్చాడు. అన్నమయ్యకు అదొక మధుర క్షణం.

నారదుడి ఉద్బోధతో అన్నమయ్యలో భక్తి పారవశ్యం కలిగి.. సంకీర్తనా రచనకు శ్రీకారం చుట్టాడు. వాగ్గేయకారుడిగా అసంఖ్యాకమైన కీర్తనలను అందించాడు. నారద మహర్షి ఖగోళ, జ్యోతిష శాస్త్రాల్లో నిష్ణాతుడని మహాభారతం తెలియజేసింది. వేదాలు, ఉపనిషత్తుల్లో నారద మహర్షి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ ముని ఎందరికో మోక్ష మార్గాన్ని చూపాడు. ‘యదార్థవాదీ లోక విరోధీ’ అన్నారు. నిజాలు మాట్లాడిన ఆయన కలహప్రియుడు, కలహ భోజనుడిగా ప్రసిద్ధుడయ్యాడు.

ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటంలో తనదైన పాత్ర పోషించాడు. ఆయన ఏం చేసినా లోక కల్యాణం కోసమే. దేవతలు, దానవులు, మానవులకు సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేశాడు. నిరంతర సంచారిగా ఉండమని ద]క్షుడు ఇచ్చిన శాపాన్ని నారదుడు వరంగా మార్చుకున్నాడు. ధర్మ ప్రచారానికి ప్రతి క్షణం వినియోగిస్తూ, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఎందరో భక్తులకు మార్గదర్శనం చేశాడు. కర్ణాటకలోని చిగటేరీలో నారదమహర్షికి ఆలయం ఉంది.