
4views
కైలాస-మానసరోవర్ యాత్ర మొదటి బ్యాచ్ శనివారం ఆరంభమైంది. సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్ ఇండో-చైనా సరిహద్దులోని నాథూలా పాస్ వద్ద పచ్చజెండా ఊపి యాత్రను ఆరంభించారు. నిరాటంకంగా యాత్రను పూర్తిచేయాలని ఆకాంక్షిస్తూ.. యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బృందంలో నలుగురు సమన్వయ అధికారులు, ఒక వైద్యాధికారితోపాటు 44 మంది యాత్రికులు ఉన్నారు. వారిలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 32 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. శీతల వాతావరణానికి అలవాటు పడేందుకు ఈ బృందం సిక్కింలో నాలుగు రోజులపాటు బసచేసింది. ప్రస్తుతం వీరు నాథూలా పాస్ ద్వారా టిబెట్‌లోకి ప్రవేశించారు. పవిత్ర కైలాస పర్వతం, మానసరోవర్ మార్గంలో కీలక మజిలీ అయిన గ్యాంగ్జే వైపు వీరు పయనమయ్యారు. కరోనా వల్ల ఐదు సంవత్సరాలు ఈ యాత్రకు అంతరాయం ఏర్పడగా.. గత ఏడాదే పునఃప్రారంభమైంది.





