
ప్రాచీన భారత మూలాలున్న యోగా విశ్వవ్యాప్తమైందని, అన్ని మతాలకు చెందిన లక్షల మందికి ఇది ఉపయోగపడుతోందని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. ఐరాసలోని భారత శాశ్వత కమిషన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ కార్యక్రమం నిర్వహించింది. దీనికి యోగా సాధకులు, దౌత్యవేత్తలు, ఐరాస అధికారులు, దౌత్య సిబ్బంది హాజరయ్యారు. 2028- 29 నాటికి ఐరాస భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యత్వాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్న కొద్దీ శారీరక, మానసిక శ్రేయస్సు, చలనశీలత ప్రాముఖ్యతను యోగా మనకు తెలియజేస్తుందని ప్రసంగించిన గుటెరస్ నమస్తే అంటూ తన ఉపన్యాసాన్ని ముగించారు.
చైనాలో భారత్ యోగా..
బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన యోగా కార్యక్రమంలో చైనా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనిలో వెయ్యి మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారని, వీరిలో ఎక్కువ శాతం చైనీయులు ఉన్నారని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని, చైనాలో యోగా సాధకులు పెరుగుతుండటం తనకు ప్రత్యేక ఆనందాన్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.