
మేవాఢ్ పాలకుడు, రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్ 486వ జయంతి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయపుర్‌లో ఘనంగా జరిగాయి. మోతీ మగ్రి వద్ద ఉన్న మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని పూలమాలలతో అందంగా తీర్చిదిద్దారు. అలాగే ఆ విగ్రహం వద్ద 486 దీపాలను వెలిగించి, 486 కిలోల లడ్డూలను నైవేద్యంగా సమర్పించారు. మరోవైపు, రాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రాజ్‌సమంద్‌లోని వీరత్వానికి, శౌర్యానికి సాక్షిగా నిలిచిన ‘హల్దీఘాటి’ నేల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అత్యంత భక్తిశ్రద్ధలతో సెలబ్రేషన్స్
ఉదయపుర్‌లోని మోతీ మగ్రి వద్ద మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. అక్కడ ఉన్న మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని పూలమాలలు, ఇతర అలంకరణ సామగ్రితో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మహారాణా ప్రతాప్ స్మారక కమిటీ ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. మహారాణా ప్రతాప్ వంశస్థులైన డాక్టర్ లక్ష్యరాజ్ సింగ్ మేవార్ తరపున విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, ఆచారాలు నిర్వహించారు. అలాగే రాణా ప్రతాప్ విగ్రహం వద్ద 486 దీపాలను వెలిగించి, 486 కిలోల లడ్డూలను నైవేద్యంగా పెట్టారు.
‘రాణా ప్రతాప్ జీవితం త్యాగం, దేశభక్తి, పోరాట పటిమకు చిహ్నం’
డాక్టర్ లక్ష్యరాజ్ సింగ్ మేవార్ ఆదేశాల మేరకు ఈ పవిత్రమైన రోజున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, సందర్శకులందరికీ స్మారక కేంద్రంలోకి ఉచిత ప్రవేశం కల్పించామని మహారాణా ప్రతాప్ స్మారక కమిటీ పరిపాలనా అధికారి మాన్వేంద్ర సింగ్ తెలిపారు. మహారాణా ప్రతాప్ జీవితం త్యాగం, ఆత్మగౌరవం, దేశభక్తి, పోరాట పటిమకు సాటిలేని చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆ వీరుడికి నిజమైన నివాళి అంటే యువత ఆయన ఆదర్శాలను తమ జీవితంలో ఆచరణలో పెట్టడమేనని, అలాగే దేశ నిర్మాణం, సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించడమేనని అభిప్రాయపడ్డారు.
హల్దిఘాటి నేల గురించి తెలుసా?
మహారాణా ప్రతాప్ జయంతి వేళ రాజ్‌సమంద్‌లోని ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఉన్న హల్దీఘాటి నేల గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. హల్దీఘాటి వీరత్వానికి నిలయం. ఈ పవిత్ర నేల ఇప్పటికీ ధైర్యం, ఆత్మగౌరవం, దేశభక్తితో కూడిన అజరామరమైన గాథను చాటుతూనే ఉంది. ఇక్కడి నేలలోని ప్రతి అణువూ మేవార్ యోధుడు మహారాణా ప్రతాప్, ఆయన వీర సైనికుల అచంచలమైన ధైర్యసాహసాలకు సాక్ష్యంగా నిలుస్తోంది.
కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, అడవులలో ఏళ్ల తరబడి గడిపినప్పటికీ, వనరుల కొరతతో సతమతమైనప్పటికీ మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవం, మాతృభూమి స్వేచ్ఛ విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. అందుకే హల్దీఘాటిని సందర్శించే దేశవిదేశీ పర్యాటకులు అక్కడి నేలకు నివాళులు అర్పించడమే కాకుండా, ఆ మట్టిని నుదుటిపై తిలకంగా పెట్టుకుంటారు. ఆ మట్టిని ఒక జ్ఞాపికగా తమతో పాటు ఇంటికి తీసుకెళ్తుంటారు.
అక్బర్‌ను ఎదుర్కొన్న రాణా ప్రతాప్
రాజ్‌సమంద్ జిల్లాలోని ఖమ్నోర్ ప్రాంతంలో ఉన్న హల్దీఘాటి కనుమ పసుపు రంగులో ఉండే మట్టికి ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ నేల గుర్తింపు కేవలం దాని రంగుపైనే కాకుండా, అక్కడ చిందిన యోధుల రక్తం, చేసిన త్యాగాలపై ఆధారపడి ఉంది. 1576 జూన్ 18న భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన పోరాటాలలో ఒకటైన హల్దీఘాటి యుద్ధం సరిగ్గా ఇదే నేలపై జరిగింది. ఈ యుద్ధం కేవలం రెండు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ మాత్రమే కాదు. ఇది ఆత్మగౌరవం, స్వేచ్ఛా పరిరక్షణకు ప్రతీకగా నిలిచింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ మేవార్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ మహారాణా ప్రతాప్ అతని ముందు తలవంచడానికి నిరాకరించారు. అక్బర్ అపారమైన సైనిక శక్తిని మహారాణా ప్రతాప్ తన పరిమిత సైన్యంతో ఎదుర్కొన్నారు. మహారాణా ప్రతాప్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, వీరత్వానికి హల్దీఘాటి ప్రతీకగా నిలుస్తోంది.
హల్దీఘాటి కేవలం ఒక చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతి, వీరత్వం, ఆత్మగౌరవానికి ప్రతీక. ఇక్కడి మట్టి ప్రతి భారతీయుడిలో దేశభక్తిని, త్యాగనిరతిని నింపుతూ స్ఫూర్తినిస్తుంది. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం చేసే పోరాటాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదని మహారాణా ప్రతాప్ జీవితం మనకు బోధిస్తుంది. హల్దీఘాటి వీరగాథ భవిష్యత్ తరాలకు దేశభక్తి, ధైర్యసాహసాల సందేశాన్ని ఎప్పటికీ అందిస్తుంది. చాలా మంది హల్దీఘాటి మట్టిని తిలకంగా దిద్దుకోవడాన్ని అదృష్టంగా భావిస్తారు. అలాగే హల్దీఘాటి సహజ గంధపు చెట్లకు నిలయంగా ఉంది. ఈ క్రమంలో ఆసియాలోని అతిపెద్ద సహజ గంధపు చెట్ల అడవులలో ఒకటిగా నిలిచింది.
ఆయన వల్లే దేశంలో సనాతన ధర్మం సజీవంగా ఉంది : మంత్రి సంజయ్ శర్మ
మహారాణా ప్రతాప్ వల్లే నేడు దేశంలో, రాజస్థాన్‌లో సనాతన ధర్మం సజీవంగా ఉందని రాజస్థాన్ అటవీ శాఖ మంత్రి సంజయ్ శర్మ తెలిపారు. అందుకు యావత్ భారత్ మహారాణా ప్రతాప్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. అక్బర్ భారత్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు మహారాణా ప్రతాప్, శివాజీ మహారాజ్ అతడ్ని అడ్డుకోవడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా దేశమంతా ఆయనకు భక్తిపూర్వక నివాళులు అర్పిస్తోందని వెల్లడించారు.





