News

ఘన జీవామృతం తయారీపై రైతులకు అవగాహన

43views

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోట నాగవరం గ్రామంలో రైతుల సమక్షంలో ఘన జీవామృతం తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఘన జీవామృతం తయారీ విధానం, దాని ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డివిజనల్ ఇన్‌చార్జి ఎన్ఎఫ్ఏ హుస్సేన్ మాట్లాడుతూ, రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఘన జీవామృతం భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పంటల దిగుబడి, నాణ్యత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి మరియు స్థానిక మట్టితో తయారయ్యే ఘన జీవామృతం నేలలో సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి భూసారాన్ని పెంచుతుందని వివరించారు. ఇది పంటలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తీసుకువచ్చి వేర్ల అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, నేలలో తేమ నిల్వ ఉండేలా చేసి పంటల పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పారు.

తక్కువ ఖర్చుతో రైతులు స్వయంగా తయారు చేసుకోగల ఈ ప్రకృతి వ్యవసాయ ఇన్‌పుట్‌ను ప్రతి రైతు వినియోగించుకోవాలని హుస్సేన్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏ డి. మధుబాబు, రైతులు, స్థానిక ప్రజలు మరియు ఇతరులు పాల్గొన్నారు.