News

శబరిమలలో ఏఐతో రద్దీ నియంత్రణ!

36views

ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన శబరిమలలో భక్తుల రద్దీ నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను అమలు చేయనున్నట్లు శబరిమల దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పి.ఎస్. జయకుమార్ వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, పంబ నుంచి సన్నిధానం వరకు భక్తుల కదలికలను ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా భక్తులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

దేవస్థాన సేవల పూర్తి డిజిటలైజేషన్
శబరిమల ఆలయంలో ఇకపై నగదు ఆధారిత లావాదేవీలకు స్వస్తి పలుకుతూ, అన్ని సేవలను డిజిటల్ విధానంలోకి తీసుకురానున్నారు. కానుకలు సమర్పించడం, ప్రసాదాల కొనుగోలు, వసతి బుకింగ్, ఇతర సేవల చెల్లింపులు అన్నీ డిజిటల్ మాధ్యమాల ద్వారా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం బోర్డు ప్రకటించింది.దేవస్థాన వ్యవహారాల్లో పారదర్శకతను పెంచడం, అవినీతి ఆరోపణలకు తావులేకుండా చేయడం, ఆదాయ-వ్యయాల నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధ్యక్షుడు తెలిపారు.