News

‘ఆపరేషన్‌ సిమ్రీ’ ఫలితంగా దొరికిన పాకిస్థా‌నీ..

39views

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సిమ్రీ గ్రామం సమీపంలో ఓ పాకిస్థాన్‌ పౌరుడిని అధికారులు పట్టుకున్నారు. భద్రతా పరంగా దీన్ని భారీ విజయంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు కలిసి నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిమ్రీ’ ఫలితంగా అతడు దొరికాడు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పాకిస్థాన్‌ పౌరుడు అనుమానాస్పదంగా నియంత్రణ రేఖను దాటాడు. నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా అప్రమత్తమైన చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే అవకాశాన్ని నివారించింది.

“నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా, అప్రమత్తంగా ఉన్న చినార్‌ వారియర్స్‌ జమ్మూ కశ్మీర్‌ పోలీసులతో కలిసి జూన్‌ 12న కుప్వారాలోని సిమ్రీ గ్రామం సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో నియంత్రణ రేఖ దాటిన ఓ పాక్‌ పౌరుడిని పట్టుకున్నారు. వేగంగా స్పందించిన చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే ప‍్రమాదాన్ని నివారించింది. చొరబాటుదారుడిపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది” అని చినార్‌ కార్ప్స్‌ ఎక్స్‌ ద్వారా పోస్టు చేసింది.

నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) అంటే భారత్‌, పాకిస్థాన్‌ అధీన ప్రాంతాల మధ్య ఉన్న సైనిక విభజన రేఖ. ఈ ప్రాంతం చాలా కీలకం. ఉగ్రవాదులు చొరబడకుండా సైనికులు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది.