News

మహానంది పుణ్యక్షేత్రంలో “యోగాంధ్ర–2026” కార్యక్రమం

31views

భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన మహోన్నత ఆధ్యాత్మిక-ఆరోగ్య సాధన అయిన యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహానంది పుణ్యక్షేత్రంలో నిర్వహించిన “యోగాంధ్ర–2026” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగాసనాలు మరియు ధ్యాన సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించడానికి యోగం అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాభ్యాసానికి కేటాయించి ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

పవిత్ర మహానంది క్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా యోగాభ్యాసకులు పాల్గొని సామూహిక యోగాసనాలు నిర్వహించారు. ధ్యాన గురువు బిక్షమయ్య గురూజీ ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనలు నిర్వహించగా పాల్గొన్న వారిలో విశేష ఉత్సాహం కనిపించింది.

యోగం కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి మార్గమని వక్తలు వివరించారు. భారతీయ ఋషుల తపస్సు ఫలితంగా ప్రపంచానికి అందిన ఈ మహోన్నత సంప్రదాయం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఆర్డీవో చల్లా విశ్వనాథ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, మహానంది దేవస్థానం ఈవో నల్లకాలువ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌డీఏపీ శ్రీధర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లీలావతి, ఆర్టీసీ ఆర్ఎం రజియా సుల్తానా, జడ్పీ సీఈవో సుబ్బారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

ప్రపంచానికి భారతదేశం అందించిన యోగ విద్యను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావాలని పలువురు ఆకాంక్షించారు.