News

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లికి విశేష పూజలు

20views

ప్రకృతి వైపరీత్యాల నుంచి తమ జీవనాధారమైన మత్స్య పరిశ్రమకు, మరపడవలకు మరియు మత్స్యకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లికి విశేష పూజలు నిర్వహించారు. మత్స్యకారులు, బోటు యజమానులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు.

ఈ సందర్భంగా గంగమ్మ తల్లితో పాటు సముద్ర దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తిశ్రద్ధలతో పూజలు సాగాయి. రాష్ట్ర మరపడవల సంఘం నాయకులు మైలపల్లి లక్ష్మణరావు, పీ.సీ. అప్పారావు, మున్నం బాలాజీ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవల చైర్మన్ సీతంరాజు సుధాకర్ తదితర ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

61 రోజుల విరామం అనంతరం ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి మత్స్యవేట పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మత్స్యకారులు గంగమ్మ జాతరను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హార్బర్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక, ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది.

మత్స్యకారుల జీవితాల్లో సుఖశాంతులు, సముద్రంలో సురక్షిత వేట, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కలగాలని ఈ పూజల ద్వారా భక్తులు గంగమ్మ తల్లిని ప్రార్థించారు.