ArticlesNews

ఆధ్యాత్మిక జీవన ప్రస్థానం

29views

నిత్యజీవితంలో శారీరక అనారోగ్యాలు, మానసిక రోదనలు, ఆర్థిక బాధలు, ఆత్మీయులతో కలహాలు వంటి ఆవేదనలు, ఆందోళనలూ మనల్ని పీడిస్తుంటాయి. వీటన్నింటినీ మించిన భయానక దుఃఖం మరణం. అది తీరని శోకాన్ని కలిగించి గుండెను రగిలిస్తుంది. కానీ అలా వ్యథ చెందడం సరికాదని ప్రబోధించారు వేదపండితులు.

మన సనాతన ధర్మం జీవితాన్ని కేవలం శారీరక ఉనికిగా కాకుండా, ప్రకృతితో మమేకమైన దివ్యయజ్ఞంగా పరిగణిస్తుంది. వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు జీవితాన్ని ఆత్మ సాక్షాత్కారానికి వేదికగా అభివర్ణించి, మరణాన్ని పరిపూర్ణ విశ్రాంతిగా పేర్కొన్నాయి. భారతీయ యోగశాస్త్రం ప్రకారం- మన శరీరం పంచభూతాల సమ్మేళనం. ఊర్ధ్వగతి అంటే వాటిని ప్రకృతికి తిరిగి అప్పగించే సహజ ప్రక్రియ. ఈ సత్యాన్ని కఠోపనిషత్‌లో నచికేతుడికి యమధర్మరాజు వివరించాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు- ‘ఆత్మకు జనన మరణాలు లేవు, అది దేహాన్ని వస్త్రం వలె మారుస్తుంది’ అని స్పష్టం చేశాడు. ఈశావాస్యోపనిషత్‌ ప్రకారం, సర్వవ్యాప్తమైన పరమాత్మను దర్శించినవారికి దేహత్యాగం భయంకరమైన ఘట్టం కాదు; అదొక నిష్క్రమణ మాత్రమే. పురాణాలు అంత్యకాలంలో పరమాత్మను స్మరించడం వల్ల ఉత్తమ గతి కలుగుతుందని ఉద్ఘాటించాయి. రామాయణంలో జటాయువు తన అంతిమ సమయాన స్వామిని దర్శించి, జ్ఞానంతో శరీరత్యాగం చేశాడు.
సహజం.. సులభం..

‘ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్‌ / ఉర్వారుకమివ బంధనాత్‌ మృత్యోర్ముక్షీయ మామృతాత్‌’ ఇది మహా మృత్యుంజయ మంత్రం. ఇందులోని ‘ఉర్వారుకమివ బంధనాత్‌’ అనే ఉపమానం లోతైనది. ఉర్వారుకం అంటే దోసకాయ. అది పచ్చిగా ఉన్నప్పుడు తీగను గట్టిగా పట్టుకుని పోషకాలను తీసుకున్నట్టు.. పక్వత లేని స్థితిలో మనిషి లౌకిక సుఖాల గురించి తపిస్తాడు. అజ్ఞానమనే బంధంలో ఉన్నంతవరకూ మరణం ఒక భయానక ప్రక్రియగా కనిపిస్తుంది. సాధనతో పక్వత, పరిణితి వస్తాయి. తీగ నుంచి పండు విడిపోయే సమయానికి మధురంగా మారినట్లు జ్ఞానార్జనతో పరిపూర్ణత సిద్ధిస్తుంది. పక్వానికి వచ్చిన ఫలం సహజంగా రాలిపోయినట్లు.. ఆధ్యాత్మిక పరిపక్వత సాధించిన వ్యక్తికి- దేహం నుంచి ఆత్మ వేరు కావడం అంతే సహజం, సులభం.

ఆధ్యాత్మిక చింతనతో దైవానికి చేరువైనప్పుడు.. మోహాలు, మమకారాలు సడలుతాయి. మహాభారతంలో భీష్మాచార్యుని ‘ఇచ్ఛామరణం’ వెనుక ఉన్న రహస్యం ఇదే. పరిపక్వత సిద్ధించిన భీష్ముడు తన దేహాన్ని విడిచే సమయాన్ని తానే స్వయంగా నిర్ణయించుకోగలిగాడు.

సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి- తుది క్షణంలో ఆందోళన చెందడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రబోధించిన ‘స్థితప్రజ్ఞత’ అనాయాస మరణానికి మూలస్తంభం. ఓంకార నాదంలో లీనమైన మనసు.. దేహ త్యాగ సమయంలో బ్రహ్మరంధ్రం ద్వారా ప్రయాణించి మోక్షాన్ని పొందుతుందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి.

సనాతన సంప్రదాయంలో ‘అంతిమ యాత్ర’ అంటే ఆత్మ- తన మూలస్థానమైన పరమాత్మలో విలీనమయ్యే మహాయోగం. నిష్కామకర్మ ద్వారా మనసులో కల్మషం తొలగించుకుని, ఇహలోక బంధాల నుంచి విముక్తులైనవారు కాంతి మార్గంలో పయనించి.. దైవసన్నిధి చేరతారని ఇతిహాసాలు తెలియజేశాయి.

బ్రహ్మలోక ప్రాప్తి
అంతిమ సమయంలో మనసు ఎలా ఉండాలో ఉపనిషత్తులు సూచించాయి. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధిని పొందిన యోగికి- మరణం ఒక మధురమైన నిద్ర వంటిది. ఆత్మజ్ఞానమే ముక్తికి ఏకైక మార్గమని వేదాలు స్పష్టం చేశాయి. భగవంతుని నామస్మరణతో అహంకారాన్ని తొలగించుకున్నప్పుడు.. జీవుడు బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. అంతిమయాత్ర భయానక సమాప్తి కాదు, అది నూతన జీవన ఆరంభానికి సోపానం- అని భాగవతంలో శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు.

దైన్యత లేని స్థితి
ఆధునిక విజ్ఞానం కేవలం జీవన కాల పొడిగింపుపై దృష్టి సారిస్తే.. మన తత్వవేత్తలు ధర్మబద్ధమైన పరిపూర్ణ జీవనాన్ని కాంక్షించి, సద్గతుల ప్రాప్తికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆవేదన, ఆందోళన లేని సహజసిద్ధమైన ముగింపును ‘అనాయాస మరణం’ అన్నారు.

అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం, దేహి మే పరమేశ్వర

నిత్య ప్రార్థనలో మనం పఠించే ఈ శ్లోకానికి- ‘పరమేశా! నేను ఎవరి మీదా ఆధారపడకుండా, దీనత్వం లేకుండా జీవించాలి. నొప్పి లేకుండా మరణించాలి. ఈ దేహానంతరం నీ సాన్నిధ్యం లభించాలి’ అనేది అర్థం.

వృద్ధాప్యంలోనో మరణం ఆసన్నమైనప్పుడో మాత్రమే దైవాన్ని స్మరించడం కాదు; ఆధ్యాత్మిక చింతన అనేది జీవనపర్యంతం కొనసాగాల్సిన ప్రక్రియ. మన శ్వాస ఊపిరి నిలబెట్టుకోవడానికి మాత్రమే కాదు.. సృష్టిలోని దైవత్వాన్ని స్పృశించే తపస్సుగా మారినప్పుడు అనాయాస మరణం సాధ్యమవుతుంది. మనది, మనవాళ్లు అనే బంధనాలను ఛేదించుకుని, పరమాత్మలో విలీనమవడమే జీవన సార్థకత. ఇది వినాశనం కాదు; అదొక దివ్యమైన పరిణితి, అనంత పయనం, పరిపూర్ణ మోక్షస్థితి.