News

నల్లమలలో చరిత్ర అధ్యయనం

5views

నల్లమల… అభయారణ్యం మాత్రమే కాదు మన చరిత్ర, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ఆ ఘనతను చాటుతూ ఇప్పటికే ఎన్నో శాసనాలు, రేఖాచిత్రాలు, శిల్పాలు వెలుగుచూశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా… ఇప్పటివరకు వీటిపై ప్రత్యేక అధ్యయనం జరగలేదు. ప్రస్తుతం ఆ లోటును భర్తీ చేస్తూ… ఈ పరిధిలో లభ్యమైన వివరాలను భద్రపరిచేందుకు భారత పురావస్తుశాఖ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా అటవీశాఖ సహకారంతో సమగ్ర సర్వే నిర్వహించనుంది.

మార్కాపురం, నంద్యాల, పల్నాడు జిల్లాల పరిధిలో 3,727.82 చ.కి.మీ. మేర నాగార్జునసాగర్‌ – శ్రీశైలం పులుల అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ పరిధిలో అటవీశాఖ గుర్తించిన ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించనున్నట్లు పురావస్తుశాఖ శాసనాల విభాగం సంచాలకులు మునిరత్నం రెడ్డి తెలిపారు. పురావస్తుశాఖ అధికారులు ఏడుగురు, అటవీ ఉన్నతాధికారులు పది మందితో పాటు మరో పది మంది సభ్యుల బృందం ఈ ప్రక్రియ చేపట్టనుంది.

నల్లమలలో పరిశోధన నిమిత్తం అటవీశాఖ రాష్ట్ర పీసీసీఎఫ్‌ చలపతిరావు, పురావస్తుశాఖ డైరెక్టర్‌ మునిరత్నంరెడ్డి బుధవారం వై.పాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లమలలో ఇప్పటివరకు ఇలాంటి పరిశోధన జరగలేదన్నారు. కడప జిల్లా లంకమల అడవిలో గతంలో లభ్యమైన శాసనాలు కొత్త చరిత్ర తెలుసుకునేందుకు నాంది పలికాయన్నారు. నల్లమలలోనూ విలువైన సమాచారం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

రాజులు తిరుగాడిన నేల…
నల్లమల సిగన వెలసిన శ్రీశైలంలో ఒకటో శతాబ్దానికి ముందు నుంచే ఆలయాలు ఉన్నట్లు పలు శాసనాలు లభ్యమయ్యాయి. శ్రీకృష్ణ దేవవరాయలు, ఛత్రపతి శివాజీ తదితర మహారాజులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. పల్లవులు, కాకతీయులు, ఇతర రాజులు శ్రీశైలం అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. క్షేత్రానికి వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా అటవీ ప్రాంతంలో పలు ఏర్పాట్లు చేశారు. భక్తులు సేదతీరేందుకు, బస చేసేందుకు మండపాలు, గుహలు, స్నానాలు చేసేందుకు కొలనులు నిర్మించారు. ఇందుకు సంబంధించిన శాసనాలు వెలుగు చూశాయి. వీటిని అధ్యయనం చేయడం ద్వారా నాటి రాజులు, ఆలయాల వివరాలు, చేసిన అభివృద్ధి పనులు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.