
దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేసే ఏ అర్చకుడైనా విదేశీయానం చేసి వస్తే, అతన్ని ప్రధాన ఆలయ గర్భాలయంలో అర్చకత్వం (పూజా కార్యక్రమాలు) నిమిత్తం అనుమతించరాదంటూ 2010లో ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను, అలాగే ఇందుకు సంబంధించి 2024లో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వామి జారీ చేసిన ప్రామాణికతను అమలు చేయాలంటూ సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ ఏడాది మార్చి 30న జారీ చేసిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వం లోని ధర్మాసనం నిలుపుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన కీలక విషయాలను దేవదాయశాఖ అధికారులు సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాలేదని, మార్చి 30న జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్ధంగా నిలబడవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసిన ధర్మాసనం, ఈ వ్యవహారాన్ని తిరిగి సింగిల్ జడ్జికే నివేదించింది. ఈ మేరకు సీజే జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.
నేపథ్యం ఇదీ..
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో పలువురు ప్రధాన అర్చకులు విదేశీయానం చేసి వచ్చారని, అయినా కూడా వారిని ప్రధాన గర్భాలయం లో అర్చకత్వం నిర్వహణకు దేవదాయ అధికారులు అనుమతిస్తున్నారంటూ ఆ దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారుగా పనిచేస్తున్న డీఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మహాతీర్థ భారతీ స్వామి 2024 డిసెంబర్ 12న జారీ చేసిన ప్రామాణికతను, ధార్మిక పరిషత్ 2010 సర్క్యులర్ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనికి అనుకూలంగా సింగిల్ జడ్జి మార్చి 30న తీర్పు ఇచ్చారు. అయితే ఈ ఉత్తర్వుల ప్రభావానికి గురైన సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు సీజే ధర్మాసనం ముందు ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేశారు. శ్రీనివాసాచార్యుల తరఫు న్యాయవాది డీవీ శశిధర్ వాదనలు వినిపిస్తూ, ‘అప్పీలుదారు 2001 నుం డి 2006 మధ్య కాలంలో దేవదాయ శాఖ కమిషనర్ నుండి ముందస్తు అనుమతి పొంది, వేతన రహిత సెలవుపై అమెరికా వెళ్లారు. 2010 నాటి సర్క్యులర్ ఆయన ప్రయాణం తర్వాత వచ్చింది. కాబట్టి అది ఆయనకు వర్తించదు. పైగా మార్చి 30న సింగిల్ జడ్జి తీర్పు వెలువరించే నాటికే 2010 నాటి సర్కులర్ను సవాలు చేస్తూ అప్పీలుదారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ విషయాన్ని దేవదాయ శాఖ అధికారులు సింగిల్ జడ్జి దృష్టికి తీసుకువెళ్లలేదు’ అని వాదించారు.





