
తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ముడి దినుసుల సరఫరాలో రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇటీవల నిర్వహించిన అభిప్రాయ సేకరణలో దాదాపు 98 శాతానికి పైగా భక్తులు గతంతో పోలిస్తే అన్నప్రసాదం రుచి, నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని పేర్కొన్నారని అదనపు ఈవో తెలిపారు.
అలాగే మిల్లర్లు స్వయంగా అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోగా, అధిక శాతం మంది భక్తులు అన్నప్రసాద నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. అభిప్రాయ సేకరణలో కొందరు భక్తులు అన్నప్రసాదంతో పాటు అదనంగా పప్పును కూడా వడ్డిస్తే మరింత బాగుంటుందని సూచించారని తెలిపారు. ఈ సూచనను సానుకూలంగా పరిగణించి అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.టీటీడీకి అవసరమైన వివిధ రకాల పప్పు దినుసులను కూడా దాల్ అసోసియేషన్ ద్వారా సరఫరా చేసే అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అత్యుత్తమ నాణ్యత గల ఆహార పదార్థాలు అందించే దిశగా విధివిధానాలను రూపొందిస్తున్నామన్నాని అదనపు ఈవో అన్నారు.





