News

తమిళం నేర్పలేదని క్రైస్తవ మతం నేర్పిందని ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ కామెంట్స్

34views

చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి.. ‘‘తమిళ భాషను ఎంతగా అధ్యయనం చేసినా కొందరు అర్థం చేసుకోలేని విషయాలను క్రైస్తవ మతం తనకు నేర్పింది’’ అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

తమిళ భాషను కించపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ నేతలు మంత్రిని హెచ్చరించారు. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తమిళాన్ని సరిగ్గా మాట్లాడలేదని, వ్యాకరణపరమైన తప్పులు ఉన్నాయని ఎండీఎంకే ఎమ్మెల్యే టీఎం రాజేంద్రన్ విమర్శించారు. భవిష్యత్తులో అసెంబ్లీలో తమిళంలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా మాట్లాడాలని సూచించారు.

అయితే తన వ్యాఖ్యలను మంత్రి మేరీ విల్సన్ సమర్థించుకున్నారు. క్రైస్తవ మతం తనకు ప్రేమ, శాంతి, కరుణ విలువలను నేర్పిందని అన్నారు. ఎంతగా తమిళ భాషను అధ్యయనం చేసినప్పటికీ కొందరు ఈ విలువలను అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు.

తాను బైబిల్ చదివానని, పుట్టుకతోనే క్రైస్తవుడినని మంత్రి తెలిపారు. తనకు తమిళ భాషపై ఎలాంటి వ్యతిరేకత లేదని, తన ప్రాధాన్యత తమిళ భాషకు సంబంధించిన విమర్శలు కాదని, తమిళ పాలన, రాష్ట్ర అభివృద్ధి అంశాలేనని స్పష్టం చేశారు.

తాను మాట్లాడే విధానం, తన వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు ఎగతాళి చేస్తున్నారని మేరీ విల్సన్ ఆరోపించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తమిళనాడులో భాష, మతం, రాజకీయాల అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.