News

ప్రయోగాత్మకంగా ‘శ్రీవారి వైద్య సేవ’ ప్రారంభం

26views

తిరుమల తిరుపతి దేవస్థానం – టిటిడి  ఆసుపత్రుల్లో ‘శ్రీవారి వైద్య సేవ’ కార్యక్రమాన్ని  ప్రయోగాత్మకంగా   ప్రారంభించారు. ఈ సందర్భంగా టిటిడి  ఈవో ఎం. రవిచంద్ర ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రయోగాత్మక దశలో కార్యక్రమాన్ని అమలు చేసి, పాల్గొనే వైద్య నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. టిటిడి  ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు వచ్చే నిపుణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు తమకు అనుకూలమైన తేదీల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని సేవలందించవచ్చు. హిందూ మతానికి చెందిన ఆసక్తిగల వైద్య నిపుణులు ఆన్‌లైన్ ద్వారా టీటీడీ వెబ్ సైట్ : https://ttdevasthanams.ap.gov.in/srivari-seva/instructions లో తమ స్లాట్‌ను బుక్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, జేఈఓలు (విద్య, వైద్యం) డాక్టర్ శరత్, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.