News

గోమాత రాష్ట్రమాత.. అధికారిక ప్రకటన అవసరం లేదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

8views

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోమాత ప్రాముఖ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొందరు ముస్లిం పెద్దలు చేసిన డిమాండ్‌పై స్పందించిన ఆయన, సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువులకు ఆవు కేవలం జంతువు కాదని, తల్లితో సమానమైన పవిత్ర స్థానం కలిగినదని స్పష్టం చేశారు.

“ఆవుతో మాది జన్మజన్మల బంధం. గంగా మాతను ఎలా ఆరాధిస్తామో, గోమాతను కూడా అదే భక్తి, గౌరవంతో పూజిస్తాం. ఆవు మాకు తల్లిలాంటిది. కానీ మా తల్లిని పదే పదే పశువు అని పిలవడం బాధాకరం” అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

అలాగే, “గోమాత మా రాష్ట్రమాత. ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులతో ప్రకటించాల్సిన అవసరం లేదు. సనాతన సంస్కృతిలో గోవుకు అత్యున్నత స్థానం ఉంది” అని ఆయన అన్నారు.

హిందూ సంప్రదాయంలో గోవును ధర్మం, సంస్కృతి, వ్యవసాయం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారని, గోరక్షణ భారతీయ విలువల్లో కీలక భాగమని ఆయన వ్యాఖ్యానించారు. యోగి చేసిన ఈ వ్యాఖ్యలు సనాతన ధర్మం పట్ల గౌరవాన్ని, గోమాత పట్ల హిందూ సమాజంలో ఉన్న ఆరాధన భావాన్ని మరోసారి ప్రతిబింబించాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.