
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కేంద్ర కార్యాలయంపై నిఘా (రెక్కీ) పెట్టిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జైష్-ఎ-మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన నిందితుడు రైస్ అహ్మద్ షేక్ తన తండ్రి అంతర్జాతీయ ఫారెక్స్ కార్డును ఉపయోగించి, యూఎస్ డాలర్లలో విమాన టిక్కెట్లను బుక్ చేసినట్లు కోర్టు విచారణలో నిరూపితమైంది.
నాగ్‌పూర్‌లోని ప్రత్యేక సెషన్స్ కోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణలో భాగంగా, ఇండిగో ఎయిర్‌లైన్స్ మాజీ ఎయిర్‌పోర్ట్ మేనేజర్ చారు వర్మ ప్రాసిక్యూషన్ తరపున హాజరై సాక్ష్యం ఇచ్చారు. రైస్ అహ్మద్ షేక్ (అలియాస్ అసదుల్లా షేక్) ఇండిగో అధికారిక వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకున్నాడని, ఆ లావాదేవీ మొత్తం విదేశీ కరెన్సీలోనే జరిగిందని ఆమె కోర్టుకు వివరించారు.
రూట్ మార్చిన ఉగ్రవాది:
దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం, నిందితుడు కళ్ళు కప్పడానికి వ్యూహాత్మకంగా ప్రయాణించాడు. 2021 జూలై 13న శ్రీనగర్ నుండి ముంబై మీదుగా నాగ్‌పూర్ చేరుకున్నాడు. ఇక్కడి మహల్ ప్రాంతంలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం, రేషీంబాగ్‌లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరం పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ సమాచారం సేకరించాడు. అనంతరం జూలై 15న నాగ్‌పూర్ నుండి ఢిల్లీ మీదుగా తిరిగి శ్రీనగర్ వెళ్ళిపోయాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే నేరుగా కాకుండా ఇలా వేర్వేరు కనెక్టింగ్ ఫ్లైట్లలో ప్రయాణించినట్లు ప్రాసిక్యూషన్ నిర్ధారించింది.
కుట్ర భగ్నం:
2021 సెప్టెంబరులో జమ్మూ కాశ్మీర్ పోలీసులు వేరే కేసులో రైస్ అహ్మద్‌ను విచారించడంతో ఈ ఘోర కుట్ర వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని జైష్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే అతను ఈ రెక్కీ నిర్వహించినట్లు తేలింది. అనంతరం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అతడిని అదుపులోకి తీసుకుంది.
ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న నిందితుడి బెయిల్ పిటిషన్‌ను గతంలోనే బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఉగ్ర దాడుల కోసం ముందస్తు సమాచారం సేకరించడం (రెక్కీ నిర్వహించడం) కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద తీవ్రమైన ఉగ్రవాద చర్యేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తాజాగా వెల్లడైన విదేశీ నిధుల (ఫారెక్స్ కార్డ్) లావాదేవీల ఆధారాలు ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ను మరింత బలోపేతం చేశాయి.
ఆర్గనైజర్ సౌజన్యంతో





