
బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ యువకుడి అరెస్టు కలకలం రేపుతోంది. మైమెన్‌సింగ్ జిల్లాలోని గౌరీపూర్ మాఝీపారా ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల హిందూ యువకుడు శ్రవణ్ చంద్ర దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర ఖురాన్‌ను అపవిత్రం చేశాడనే ఆరోపణలతో అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
స్థానికంగా అందిన సమాచారం ప్రకారం.. శ్రవణ్ చంద్ర దాస్‌కు చెందిన IMO సోషల్ మీడియా ఖాతా నుండి ఖురాన్‌కు సంబంధించిన అభ్యంతరకర చిత్రం పోస్ట్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం బయటకు రావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు స్థానిక ముస్లిం సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం శ్రవణ్ చంద్ర దాస్ ను ఢాకాలోని తేజ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతనిపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న ఒత్తిళ్లు, అరెస్టులు, మతపరమైన వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని హిందూ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టుల పేరుతో హిందూ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.





