ArticlesNews

“సరస్వతి నది” ఆనవాళ్లు ఆసక్తి రేపుతున్న సైంటిస్టుల పరిశోధన!

7views

భారతదేశంలో నదులను ఎలా పూజిస్తారో తెలిసిందే. పరమ పవిత్రంగా భావించే నదుల్లో స్నానాలు చేస్తే సర్వ పాపాలూ తొలగిపోతాయని, కష్టాలు తీరిపోతాయని నమ్ముతారు. హిందూ పురాణాల్లో నదులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి వాటిల్లో సరస్వతి నది ఒకటి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్​లో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పరిగణిస్తూ పూజిస్తారు. పుష్కర స్నానాలు చేస్తారు. కానీ, భౌతికంగా అక్కడ గంగా, యమున నదులు మాత్రమే కలుస్తాయి. సరస్వతి నది ఉండదు. పురాణాల్లో పేర్కొన్న ఈ నది అంతర్వాహిణిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. ఇన్నాళ్లూ ఇదే విశ్వాసం కొనసాగింది. అయితే, తాజాగా సైంటిస్టులు చేసిన పరిశోధన ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. భూగర్భంలో నిజంగానే సరస్వతి నది ఉందనేది ఆ విషయం! ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా బయటపెట్టారు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

సరస్వతి జన్మస్థలం :

సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి, పలు రాష్ట్రాల మీదుగా ప్రవహించి, గుజరాత్ లో అరేబియా మహా సముద్రంలో కలుస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న వాతావరణ, భౌగోళిక మార్పుల కారణంగా ఈ నది ఆవిరైపోయిందని చెబుతారు. శాస్త్రవేత్తలు కూడా ఇదే తరహా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, ఈ సరస్వతి భూగర్భంలో ప్రవహిస్తుందని నమ్మకం.

ఆనవాళ్లు గుర్తించిన సైంటిస్టులు :

సరస్వతి నదిపై హిందూ సమాజంలో ఉన్న నమ్మకానికి బలం చేకూరుస్తూ.. గంగా, యమున నదుల మధ్య భూగర్భంలో ఒక భారీ నది ప్రవహించిన ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు. హైదరాబాద్‌ కు చెందిన జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (NGRI) సైంటిస్టులు ఈ రీసెర్చ్ చేశారు. కేంద్ర భూగర్భజలాల బోర్డు (CWB) సహకారంతో నిర్వహించిన ఈ రీసెర్చ్​లో కీలక విషయాలు వెలుగు చూశాయి. హెలికాప్టర్‌ ద్వారా నిర్వహించే అత్యాధునిక జియోఫిజికల్‌ సర్వే ద్వారా సమాచారం సేకరించారు. భూగర్భంలో నది ప్రవాహ ఉనికిని ఈ సందర్భంగా వారు నిర్ధారించారు. ఈ నది దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు. భూమి ఉపరితలం నుంచి దాదాపు 15 మీటర్ల లోతులో ఈ నది ప్రవహించిందని గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పుర్‌ దాకా సుమారు 200 కిలోమీటర్ల పొడవునా సరస్వతి నది ఆనవాళ్లను గుర్తించారు.

సరస్వతేనా?

సైంటిస్టులు ఈ నదిని సరస్వతి అని చెప్పలేదు. కానీ, పురాణాల్లో పేర్కొన్న సరస్వతి నది మార్గంలోనే, ఈ నది ఆనవాళ్లు ఉండడంతో అది సరస్వతి నదే అనే నమ్మకం బలంగా వ్యక్తమవుతోంది. “ఇది గంగా, యుమున నదుల మార్పు వల్ల ఏర్పడ్డది కాదు. ఇది పూర్తిగా మూడో నది” అని ఈ రీసెర్చ్​ లో పాల్గొన్న సైంటిస్టు సుభాష్‌ చంద్ర స్పష్టం చేశారు. ఈ నది ఏంటనేది ఇప్పుడే చెప్పలేమని, హిమాలయాల వరకు కూడా ఈ నది ప్రవాహం కనిపిస్తే అప్పుడు సరస్వతి నదిగా కన్ఫామ్ చేయొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ భూగర్భ నదిలో ఇప్పుడు కూడా కొంత నీరు ఉందని చెప్పారు. వర్షపు నీళ్లను ఈ నదిలోకి పంపించడం ద్వారా, భూగర్భ నీటి మట్టాలను పెంచవచ్చని చెబుతున్నారు.

మొత్తానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సరస్వతీ నది గురించి శాస్త్రీయంగా ఆనవాళ్లు లభించడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఇది ఖచ్చితంగా సరస్వతీ నది అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.