News

గుజరాత్‌లో జగన్నాథ రథయాత్రకు ముందు.. ఐదుగురు అనుమానితుల అరెస్ట్

30views

అహ్మదాబాద్: గుజరాత్‌లో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రకు మరో రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) అప్రమత్తమైంది. భద్రతా చర్యల్లో భాగంగా సిద్ధార్థ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఐదుగురిని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అరెస్టు చేసి విచారిస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, అరెస్టయిన వ్యక్తులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైషే-మహ్మద్’ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వారి నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో బనస్కాంత జిల్లాలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, వారి పాత్ర, సంబంధాలపై అధికారులు ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు.

జూలై 16న అహ్మదాబాద్, భావ్‌నగర్, వడోదర, పటాన్, రాజ్‌కోట్ తదితర నగరాల్లో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలు వైభవంగా జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రథయాత్రల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తుల భద్రత దృష్ట్యా అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.

అరెస్టయిన వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతుండగా, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.