News

లండన్‌లో ఇమామ్ పైశాచికం.. అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలు

6views

తనకు అతీంద్రియ శక్తులున్నాయని నమ్మించి 12 ఏళ్ల బాలికలు సహా పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన భారత సంతతి ఇమామ్‌కు యూకే కోర్టు జీవిత ఖైదు విధించింది. తూర్పు లండన్‌కు చెందిన 54 ఏళ్ల అబ్దుల్ హలీమ్ ఖాన్ కనీసం 20 సంవత్సరాలు జైలులో గడపాలని స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

ఓల్డ్ ఫోర్డ్ రోడ్‌లో ఇమామ్‌గా పనిచేస్తున్న అబ్దుల్ హలీమ్ ఖాన్ తన మతపరమైన హోదాను అడ్డం పెట్టుకుని తొమ్మిదేళ్ల పాటు ఘోరాలకు పాల్పడ్డాడు. 2005 నుంచి 2014 మధ్య కాలంలో ఏడుగురు మహిళలు, బాలికలను లైంగికంగా హింసించాడు. బాధితులతో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి వారిని ఫ్లాట్లు, రహస్య ప్రదేశాలకు పిలిపించేవాడు. అక్కడ వారిపై లైంగిక దాడికి పాల్పడుతూ తనను ఒక అతీత శక్తి (జిన్) ఆవహించిందని నమ్మించే ప్రయత్నం చేసేవాడని ‘స్కై న్యూస్’ తన కథనంలో పేర్కొంది.

కొంతమంది బాధితులలోని దుష్ట శక్తులను తరిమికొడతానని, మరికొందరికి ఉన్న అనారోగ్యాలను నయం చేస్తానని మాయమాటలు చెప్పేవాడు. అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ యువతికి తానే నయం చేస్తానని చెప్పి కారులో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ‘బీబీసీ’ నివేదించింది.

ఈ కేసులో ఫిబ్రవరిలోనే దోషిగా తేలిన ఖాన్‌పై మొత్తం 21 అభియోగాలు నమోదయ్యాయి. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి లెస్లీ కత్‌బర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “పవిత్రత, భక్తి అనే ముసుగులో ఖాన్, తనను నమ్మిన మహిళలను తన లైంగిక వాంఛ తీర్చుకోవడానికి దారుణంగా వాడుకున్నాడు. ఇది ముస్లిం విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడమే” అని అన్నారు.

ముఖ్యంగా బంగ్లాదేశీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన మహిళలు, బాలికలనే లక్ష్యంగా చేసుకుని ఖాన్ ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడని జడ్జి పేర్కొన్నారు. తనపై ఎవరూ ఫిర్యాదు చేయరనే ధైర్యంతో, ఎదురు తిరిగినా తననే నమ్ముతారనే గర్వంతో అతను వ్యవహరించాడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

బాధితులలో ఒకరు కోర్టులో మాట్లాడుతూ “నా దృష్టిలో అతడు మనిషి కాదు, రూపం దాల్చిన దుర్మార్గుడు” అని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి గురించి బయటకు చెబితే, చేతబడి చేసి కుటుంబానికి హాని తలపెడతానని ఖాన్ బెదిరించినట్లు మరో బాధితురాలు తెలిపింది. విశ్వసనీయమైన మత పెద్దగా సమాజంలో గౌరవించబడే వ్యక్తి చేతిలో తాము మోసపోయామని బాధితులు వాపోయారు.