News

సనాతన ధర్మమే శాశ్వత జీవన విధానం : గరికపాటి నరసింహారావు

34views

అనకాపల్లి: సనాతన ధర్మం శాశ్వతమైన జీవన విధానమని, మానవుడు ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలనే విషయాలను నిర్దేశించే దివ్యమైన ధర్మవ్యవస్థ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. అనకాపల్లి పట్టణంలోని పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో శ్రీవివేకానంద ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సనాతన ధర్మం – మానవజన్మ సార్థకత’ అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు, ధర్మాభిమానులు హాజరయ్యారు.

గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవన విధానంలో సనాతన ధర్మం బోధించే శాశ్వత విలువలు మరింత అవసరమని అన్నారు. సత్యం, నిజాయతీ, క్రమశిక్షణ, సేవాభావం, పరస్పర గౌరవం వంటి సద్గుణాలు వ్యక్తిని ఉత్తమ పౌరుడిగా, ఆదర్శవంతమైన మనిషిగా తీర్చిదిద్దుతాయని వివరించారు.

భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం వంటి భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు మానవుడిని ధర్మమార్గంలో నడిపించే శాశ్వత మార్గదర్శకాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి నిజాయతీతో, ధర్మబద్ధంగా జీవించాలని, తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి మూలస్తంభమని చెప్పారు. స్వార్థాన్ని విడిచిపెట్టి సేవా దృక్పథంతో జీవించినప్పుడే నిజమైన ధార్మిక జీవితం సార్థకమవుతుందని ఆయన సూచించారు.

కార్యక్రమంలో శ్రీవివేకానంద ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక ఛైర్మన్ కాండ్రేగుల విష్ణుమూర్తి, మాజీ ఎంపీ బీవీ సత్యవతి, కోటారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.