News

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియామకం

27views

భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 30 మే 2026తో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనుంది. అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియక ముందే సీడీఎస్‌గా ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సీడీఎస్ పదవీకాలం ముగిసిన వెంటనే రాజా సుబ్రమణి బాధ్యతలు చేపట్టనున్నారు. దీనితోపాటు సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు తీసుకోనున్నారు.

లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి ప్రస్తుతం జాతీయ భద్రతా మండలి సచివాలయంలో సైనిక సలహాదారుగా పని చేస్తున్నారు. ఈ బాధ్యతలను గతేడాది సెప్టెంబర్ 1న ఆయన చేపట్టారు. భారత సైన్యంలో దశాబ్దాలపాటు పని చేసిన అనుభవం ఎన్.ఎస్.రాజాకు ఉంది. అలాగే ముఖ్యమైన కమాండ్, స్టాఫ్ పదవుల్లోనూ పని చేశారు. జులై 2024 నుంచి జులై 2025 వరకు ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా రాజా సుబ్రమణి విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో జాతీయ భద్రత, రక్షణ సంసిద్ధతకు సంబంధించి అనేక కీలక కార్యాచరణ, వ్యూహాత్మక అంశాల్లో పాలుపంచుకున్నారు.

అలాగే మార్చి 2023 నుంచి జూన్ 2024 మధ్య ఆర్మీ సెంట్రల్ కమాండ్‌లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గానూ పని చేసిన అనుభవం ఉంది. దశాబ్దాల పాటు చేసిన దేశ సేవకు గాను అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను ఎన్.ఎస్.రాజా అందుకున్నారు. పరమ విశిష్ట సేవా పతకం(PVSM), అతి విశిష్ట సేవా పతకం (AVSM), సేన పతకం (SM), విశిష్ట సేవా పతకం (VSM) వంటి గౌరవాలని పొందారు. కాగా, లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుంచి ఆయన మాస్టర్స్ డిగ్రీ పొందగా.. మద్రాస్ విశ్వవిద్యాలయంలో డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ పూర్తి చేశారు.