News

మతమార్పిడిని వ్యతిరేకించిన హిందూ ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగింపు

6views

 ఉత్తర ప్రదేశ్  ఘజియాబాద్ నగరంలోని సంత్‌పురా ప్రాంతంలో ఉన్న సెయింట్ థెరిసా అకాడమీ పాఠశాలలో మతమార్పిడి కార్యకలాపాలను వ్యతిరేకించిన హిందూ ఉపాధ్యాయురాలు అరుణా గోస్వామిని ఉద్యోగం నుండి తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన స్థానిక హిందూ సంఘాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

అరుణా గోస్వామి మోదీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ లూసీ హిందూ విద్యార్థులు, సిబ్బందిపై క్రైస్తవ మతాన్ని స్వీకరించాలనే ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తాను ఈ చర్యలను వ్యతిరేకించినందుకే తనను ఉద్యోగం నుండి తొలగించారని ఆమె పేర్కొన్నారు.

అరుణా గోస్వామి తన ఫిర్యాదులో, “నేను 2012 సంవత్సరం నుండి పీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. రెండు సంవత్సరాల క్రితం కొత్త ప్రిన్సిపాల్ వచ్చిన తర్వాత పాఠశాల వాతావరణం పూర్తిగా మారిపోయింది. హిందూ విద్యార్థుల చేతులకు కట్టిన పవిత్ర దారాలను కత్తిరించడం, పేద విద్యార్థులను ఆశలు చూపి చర్చికి తీసుకెళ్లడం వంటి చర్యలు జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు.

అలాగే, పాఠశాల సమయం ముగిసిన తర్వాత చర్చి ప్రార్థనలకు హాజరు కావాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారని, హిందూ పండుగల నిర్వహణపై పరిమితులు విధించారని ఆమె ఆరోపించారు. మే 4, 2026న తన చేతిపై ఉన్న “మహాదేవ్” పచ్చబొట్టును, నుదుటిపై బిందీని తొలగించాలని ప్రిన్సిపాల్ ఆదేశించారని, దీనిని వ్యతిరేకించగానే తనను ఉద్యోగం నుండి తొలగించారని తెలిపారు.

తన కుమారుడు శివ్ గోస్వామి కూడా మానసిక వేధింపులకు గురయ్యాడని, పవిత్ర దారాలను తొలగించడానికి నిరాకరించడంతో అతనిపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. హాస్టల్‌లో ఉండే సమయంలో అతను అనారోగ్యానికి గురయ్యాడని, అనంతరం పాఠశాల నుండి తొలగించారని పేర్కొన్నారు.

ఈ ఘటనకు నిరసనగా మే 5న వివిధ హిందూ సంఘాలు పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట భారీ ఆందోళన నిర్వహించాయి. నిరసనకారులు “జై శ్రీరామ్” నినాదాలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పాఠశాల ప్రవేశద్వారాన్ని మూసివేశారు.

ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో చర్చ కొనసాగుతుండగా, పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.