ArticlesNews

‘మాతృదేవోభవ’

7views

అమ్మ అంటే సృష్టి. ప్రాణిని లోకానికి తీసుకురావడంతో తల్లి పనైపోదు. శిశువును కంటికి రెప్పలా కాపాడుతుంది. కొండంత ప్రేమనందిస్తుంది. ఎన్ని కష్టాలైనా భరిస్తుంది, ఎంతటి త్యాగాలైనా చేస్తుంది. నేనున్నానన్న భరోసా ఇస్తుంది. అనుక్షణం రక్షిస్తుంది, అవసరమైతే శిక్షిస్తుంది కూడా. బిడ్డ పరిపూర్ణత సిద్ధించి వ్యక్తిగా ఎదిగినప్పుడు ఆనంద పరవశం చెందుతుంది. 

మాతృత్వం అంటే అనంతమైన అనురాగం. అజేయమైన శక్తి స్వరూపం. సృష్టి ఆరంభం నుంచి అంతం వరకూ నిరంతరాయంగా సాగే వాత్సల్యం అమ్మ.

సృష్టికి మూలమైన ప్రకృతి స్వరూపిణిగా, బిడ్డల భవితను తీర్చిదిద్దే శిల్పిగా, సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శిగా తల్లి పోషించే పాత్ర అద్వితీయం. మానవ పరిణామ క్రమం ఎన్ని మార్పులు చెందినప్పటికీ మాతృత్వ ఔన్నత్యంలో మార్పు లేదు.

బిడ్డల్ని తీర్చిదిద్దడంలో బాధ్యతల్ని నిర్వహించే వారందరినీ మాతృ స్వరూపంగానే భావించింది మన సంప్రదాయం. జన్మనిచ్చిన కన్నతల్లి, జ్ఞాన దీపాన్ని వెలిగించే గురుపత్ని, ఆధ్యాత్మిక దారి చూపే బ్రాహ్మణపత్ని, రాజ్యానికి చల్లని నీడనిచ్చే రాజపత్ని, క్షీరామృతాన్ని పంచే గోమాత, అక్కున చేర్చుకునే పెంపుడు తల్లి, సదా మన భారాన్ని మోసే భూమాత- ఈ ఏడుగురు తల్లులు జీవన గమనాన్ని రసమయం చేస్తారు. జీవితంలోని ప్రతి క్షణం, సృష్టిలోని ప్రతి కణం మాతృభావనపై ఆధారపడే నడుస్తుంది. ఇది సృష్టి ఆరంభం నుంచి అంతం వరకూ సాగే నిరంతర వాత్సల్య భావన. భగవత్‌స్వరూపుడైన శ్రీరామచంద్రుడు కూడా ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అమ్మ సాన్నిధ్యాన్ని స్వర్గం కంటే గొప్పగా భావించాడు.

యశోద – కైక

శ్రీకృష్ణుడి తల్లి అనగానే.. జన్మనిచ్చింది దేవకీదేవి అయినప్పటికీ మొదట గుర్తొచ్చేది యశోదమ్మే. కన్నయ్యను కన్నతల్లి కంటే మిన్నగా లాలించి పాలించి అమ్మతనానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చిన మాతృమూర్తి. పరమాత్మకి పాలుపట్టి పరవశించి జోలపాడిన పావనమూర్తి. బిడ్డ తప్పులు తల్లికి కనిపించవన్నట్టు.. కన్నయ్య అల్లరిపనుల్ని గోపికలు ఎన్నిసార్లు తెలియజేసినా నమ్మలేదామె. ఎప్పుడైనా తర్జని (చూపుడువేలు) చూపి దండించినా.. ఆ చిలిపిచేష్టల్ని ఎంతగానో ఆస్వాదించింది. వెన్న తిన్నాడని నోరు తెరవమంటే విశ్వరూపాన్నే దర్శింపచేశాడు. పరవశించడం ఆమె వంతైంది. ఇవన్నీ మాతృవాత్సల్యానికి మచ్చుతునకలు. బిడ్డ సర్వేశ్వరుడని తెలిసినా అతణ్ణి లోకం తెలియని బాలుడిగానే భావించిన మాతృహృదయ యశోద.

క్షణికావేశం, చెప్పుడు మాటలవల్ల చెడ్డపేరును మూట కట్టుకున్న పవిత్రమూర్తి కైక. నిజానికి కౌసల్య కంటే రాముణ్ణి ఎక్కువగా ప్రేమించి, క్షత్రియ విద్యల్లో శిక్షణనిచ్చి; ధర్మ మూర్తిగా, వీరునిగా తీర్చిదిద్దిన మాతృమూర్తి కైక.

సుమిత్ర – సీత

చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు ఎలా ఉన్నా బిడ్డల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దిన తల్లి సుమిత్ర. ఎలాంటి స్వార్థం లేకుండా లక్ష్మణ, శత్రుఘ్నుల్ని తీర్చిదిద్దింది. అనివార్య పరిస్థితుల కారణంగా కుటుంబంలో పెద్దకొడుకైన రాముడు అరణ్యవాసానికి బయల్దేరుతుంటే వెంట లక్ష్మణుణ్ణి పంపింది. రాజ్యపాలన చేస్తున్న భరతుడికి సహాయంగా శత్రుఘ్నుణ్ణి నియమించి కుటుంబం పట్ల, సమాజం పట్ల తన బాధ్యతను నిర్వర్తించిన ఆదర్శ రాజమాత సుమిత్ర.

భర్తకు దూరంగా వాల్మీకి ఆశ్రమంలో ఉంటూ లవకుశుల్ని పెంచిన తల్లి సీతమ్మ. అంతఃపురంలో పెరగాల్సిన బిడ్డల్ని అరణ్యంలో పెంచినా.. రాజ ధర్మాన్ని నేర్పి, సకలకళా పారంగతులుగా, తిరుగులేని వీరులుగా తీర్చిదిద్దింది సీత. తండ్రిలేని లోటు తెలియ కుండా గొప్ప సంస్కారాన్ని నేర్పిన సీతమ్మ ఆధునిక సమాజంలోని ఒంటరి తల్లులందరికీ గొప్ప స్ఫూర్తి.

కుంతి – గాంధారి

బిడ్డలు పసివయసులో ఉండగానే భర్తను కోల్పోయినప్పటికీ ధర్మబద్ధులుగా పరాక్రమవంతులుగా తీర్చిదిద్దిన తల్లి కుంతి. తన సంతానాన్నే కాకుండా సవతి పిల్లల్ని సైతం సొంత బిడ్డల్లా ఆదరించిన మాతృ హృదయ. అత్యంత పరాక్రమవంతులైన తన బిడ్డలు అన్యాయంగా అవమానం పొందినా, అరణ్యాల పాలైనా అధర్మంలో అడుగుపెట్టనివ్వలేదు. అదే సమయంలో దుర్నీతికి పాల్పడ్డవారిని అణిచేయాల్సిన సమయంలో సంధి మాటలు పలుకుతున్న బిడ్డల్ని అదిలించి యుద్ధసన్నద్ధుల్ని చేసి ధర్మరక్షణకు తోడ్పడిన వీరమాతగానూ నిలిచింది.

స్త్రీ సహజ అసూయకు లోనై గర్భవిచ్ఛిత్తి కావించుకున్నప్పటికీ ధర్మమార్గం తప్పని మాతృమూర్తి గాంధారి. దుర్యోధనుడి అధర్మ ప్రవర్తనను, అకృత్యాల్ని అంధరాజు గుడ్డిగా సమర్థించాడే గానీ తల్లిగా గాంధారి ఆ తప్పు ఎన్నడూ చేయలేదు. దుర్యోధనుడి అకృత్యాల్ని కొన్నిసార్లు నేరుగా చెప్పింది, చెప్పలేని సందర్భంలో మనసులో అసహ్యించుకుంది. దుర్యోధనుడు యుద్ధానికి బయల్దేరుతూ ఆశీస్సులు కోరినప్పుడు తల్లిగా దగ్గరకు తీసుకుంది. అయితే విజయోస్తు అనకుండా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం ఉంటుందని ఆశీర్వదించిన ఆదర్శమాత గాంధారి. అనసూయ త్రిమూర్తుల్ని పసికూనలుగా మలచి ఆహారాన్ని అందించగా, వకులాదేవి ఏడుకొండలస్వామి ఆకలి తీర్చింది. రామయ్యకు జోలపాడిన కౌసల్య లాలన, దారి తప్పిన పుత్రులను మందలించిన గాంధారి పాలన, పరమేశ్వరుణ్ణి పసివాడిగా భావించి గోరుముద్దలు తినిపించిన బెజ్జమ్మ పోషణ.. ధర్మరక్షణ కోసం బిడ్డల్ని కాపాడుకున్న కుంతీదేవి రక్షణ.. అన్నీ అమ్మతనపు ఆనవాళ్లే. జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పినట్టు చెడు సంతానం ఉండవచ్చు గానీ చెడు తల్లి మాత్రం ఉండదు.

‘మాతృదేవోభవ’ అన్న ఉపనిషత్తు వాక్యం అమ్మ ఔన్నత్యానికి నిలువుటద్దం. అమ్మంటే రెండు అక్షరాలు కాదు, బిడ్డల భవిష్యత్తు వెలుగుమయం కావడానికి వర్తమానంలో తనను తాను దహింపచేసుకునే జ్యోతిస్వరూపం. గోరుముద్దలతో సంస్కార బీజాల్ని అందించి నేటి బిడ్డను రేపటి పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దే సమాజ రూపశిల్పికి ప్రేమపూర్వక వందనం.