
హిందూ ధర్మప్రచారంలో భాగంగా పలు చెంచుగూడేలలో ‘మా స్వామి మల్లన్న– మా చెంతకే’ కార్యక్రమాలను నిర్వ హిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ, శ్రీశైలంలోని మేకలబండ చెంచుగేడెంలో, మార్కాపురం జిల్లా చింతలలో ధర్మప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు
హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీశైలంలోని మేకలబండ చెంచుగూడెంలో శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. ధర్మప్రచారంలో ముందుగా క్షేత్రపాలకుడైన బయలువీరభద్రస్వామికి విశేషపూజలు చేశారు. అనంతరం మేకలబండ చెంచుగూడెంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణవేదిక వద్ద వరకు దేవస్థానం ధర్మప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించారు. కల్యాణోత్సవ సంకల్పాన్ని పఠించి మహాగణపతిపూజ జరిపించారు. అమ్మవారికి కంకణధారణ అనంతరం స్వామిఅమ్మవార్ల ప్రవర పఠించారు. స్వామిఅమ్మవార్లకు వరపూజ నిర్వహించి భాషికలను అలంకరించారు. భూమండలం, శ్రీశైల క్షేత్రవర్ణనతో కూడిన మహాసంకల్పం పఠించారు. అర్చకులు మంగళాష్టకాలను పఠిస్తూ సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్ల శిరస్సుపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సమర్పించారు. లోకకల్యాణం కోసం అమ్మవారికి మాంగల్యధారణ జరిపి, తలంబ్రాలను సమర్పించారు. చివరిగా స్వామిఅమ్మవార్ల కొంగులను కలుపుతూ బ్రహ్మముడి వేశారు. భక్తులకు ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికి శేషవస్త్రాలను అందించారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్.నాయుడు, ఏపీడీ కె.పి.నాయక్, ట్రస్ట్‌బోర్డు సభ్యులు గుల్ల గంగమ్మ, కాంతివర్దిని, అధికారులు పాల్గొన్నారు.





