
ఆలయాలను లక్ష్యంగా చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రమాదకర అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు. నిందితులను మదనపల్లె పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి రూ. 5 లక్షలకు పైగా విలువ చేసే సుమారు 4 కిలోల వెండి కిరీటాలు, బంగారు తాళి బొట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు.
ఎలా పట్టుకున్నాంటే..
అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న దొంగతనాలను సీరియస్‌గా తీసుకుని పోలీసుల ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో స్థానిక చంద్ర కాలనీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారిని మహారాష్ట్రకు చెందిన అనికేత్ కై లాస్ కసరోడే (27), సునీల్ దేవరావు సూర్యవంశీ (24), మనీష్ గోపాల్ వడివే (21), ప్రకాష్ మన్సారం ఖరే(18)లుగా గుర్తించారు. వారంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఆలయాల్లో హుండీలు, విగ్రహాల ఆభరణాలను దోచుకుంటున్నట్లు వారు నేరం అంగీకరించారు.
స్వాధీనం చేసుకున్న ఆభరణాలివే
నిందితుల వద్ద నుంచి 3 వెండి కిరీటాలు, శటారి, శంఖు చక్రం, పంచామృతం గిన్నె వంటి సుమారు 4 కిలోల వెండి వస్తువులతోపాటు మూడు బంగారు తాళిబొట్లు, 2 బంగారు గిన్నె బొట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుంది. ఈ ముఠా వాయల్పాడు, బత్తలపల్లితోపాటు గుంటూరు, ఒంగోలు జిల్లాల్లోనూ చేతివాటం ప్రదర్శించినట్లు విచారణలో వెల్లడైంది.
పోలీస్ బృందాన్ని అభినందించిన ఎస్పీ
క్లిష్టమైన ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన మదనపల్లె డీఎస్పీ బి.పావని, టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, ఎస్‌ఐలు నాగేశ్వరరావు, రామాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, క్రైమ్ టీం సభ్యులు భద్రానాయక్, హరిశంకర్‌రెడ్డిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఆలయాల రక్షణ కమిటీలదే
దేవాలయాల రక్షణ పోలీసులదే కాదని, కమిటీలది కూడా అని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆభరణాలు పరిరక్షించుకోవాలని పేర్కొ న్నారు. రాత్రి వేళల్లో సెక్యూరిటీ గార్డులను నియమించుకుంటే ఇలాంటి చోరీలను అరికట్టవచ్చన్నారు. అలాగే హుండీ నగదును ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమ చేయాలని సూచించారు. అనుమా నాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100/112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి, మదనపల్లి డీఎస్పీ బి.పావని, టూటౌన్ ఎస్‌ఐలు నాగేశ్వరరావు, రామాంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





