News

తిరుమల మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లతో నామకరణం

6views

తిరుమల పురవీధులకు ఆధ్యాత్మిక, పౌరాణిక శోభను తీసుకువచ్చే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. క్షేత్రంలోని మాడ వీధులు, ప్రధాన సర్కిళ్లు, రహదారులకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్న మహనీయుల పేర్లను ఖరారు చేసింది. టీటీడీ నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ కొత్త పేర్లకు పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర వేసింది. దీంతో త్వరలోనే ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ప్రధానంగా శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు మాడ వీధులకు వేదాల పేర్లతో నామకరణం చేశారు. తూర్పు మాడ వీధిని ‘రుగ్వేద మార్గం’గా, దక్షిణ మాడ వీధిని ‘యజుర్వేద మార్గం’గా, పశ్చిమ మాడ వీధిని ‘సామవేద మార్గం’గా, ఉత్తర మాడ వీధిని ‘అధర్వణవేద మార్గం’గా పిలవనున్నారు. వీటితో పాటు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశానికి ‘భగవద్రామానుజాచార్య ప్రాంగణం’ అని, బేడీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతానికి ‘సాళువ నరసింహరాయల ప్రాంగణం’ అని పేర్లు పెట్టారు.

అలాగే, తిరుమలలోని ప్రధాన కూడళ్ల పేర్లను కూడా మార్చారు. లేపాక్షి సర్కిల్‌కు ‘అన్నమయ్య కూడలి’, రామ్‌బగీచ సర్కిల్‌కు ‘తొండమాన్‌ చక్రవర్తి కూడలి’, ఎస్‌ఎంసీ సర్కిల్‌కు ‘పురందరదాసు కూడలి’గా నామకరణం చేశారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ‘తిరువేంకటపథం’, ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు ‘అన్నమాచార్య మార్గం’ అని పేర్లు ఖరారు చేశారు. రామ్‌బగీచ నుంచి పుష్కరిణి వరకు ఉన్న మార్గానికి ‘శ్రీ కృష్ణదేవరాయల మార్గం’ అని పేరు పెట్టారు.