News

24 అంశాలకు టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి గ్రీన్ సిగ్నల్

38views

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు బీఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మొత్తం 25 ఎజెండాలకు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం స‌ర్కిల్ నుంచి బాట గంగ‌మ్మ స‌ర్కిల్ వ‌ర‌కు ఉన్న స‌ర్వ‌ద‌ర్శ‌నం క్యూలైన్ల‌లో రూ.4.55 కోట్ల‌తో అద‌న‌పు మ‌రుగుదొడ్లు నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. తిరుమ‌ల‌లోని రోడ్లు, స‌ర్కిళ్ల‌కు క‌మిటీ సూచించిన ఆధ్యాత్మిక, పురాణ ప్రాశ‌స్థ్యం క‌లిగిన పేర్లను పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టిటిడి బోర్డు విద్యా క‌మిటీ ఇచ్చిన నివేదిక మేర‌కు టీటీడీ విద్యా సంస్థ‌ల‌లో అత్యాధునిక మౌళిక వసతుల ఏర్పాటుకు అదనంగా రూ.43.40 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. ఇప్ప‌టికే గత బోర్డు స‌మావేశంలో రూ.118 కోట్లు కేటాయించిన విష‌యం తెలిసిందే. మొత్తం కలిపి రూ.161.40 కోట్లు కేటాయించారు.

నీటి వృధా అరికట్టేందుకు…

తిరుమ‌ల‌లో నీటి వృధాను అరిక‌ట్టేందుకు రోజు రోజుకు పెరుగుతున్న నీటి అవ‌స‌రాల దృష్ట్యా గోగ‌ర్భం డ్యామ్ నుండి ఫిల్ట‌ర్ ప్లాంట్ వ‌ర‌కు రూ.6 కోట్ల‌తో దాదాపు 2 కిలో మీట‌ర్ల‌ మేర అద‌న‌పు పైపులైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. టీటీడీ అవ‌స‌రాల నిమిత్తం రూ. 44.20 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, త‌మిళ‌నాడుకు చెందిన కో-ఆప్టెక్స్ సంస్థ‌ల నుండి ప‌ట్టు వ‌స్త్రాలు, దుప్పటాలు తదితరాలు కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లూరు సీతారామ‌రాజు జిల్లా పాడేరు మండ‌లంలోని వ‌ర్ధ‌న‌ప‌ల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి రూ.55 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని మ‌రింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన “అక్షర గోవిందం” కార్యక్రమంలో పాల్గొనే చిన్న పిల్లలకు పంపిణీ చేసే కిట్‌ను ఉచితంగా అందించేందుకు పచ్చ జెండా ఊపారు. త‌మిళ‌నాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా, పెరూర్ తాలూకాలోని శెట్టిపాళ్యం గ్రామంలో జీస్క్వేర్ రియ‌ల్ట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌తినిధులు టీటీడీకి రిజిష్ట్ర‌ర్ చేసి ఇచ్చిన 19.43 ఎకరాల స్థ‌లాన్ని టీటీడీలో విలీనం చేసుకోవ‌డానికి ఆమోదం చెప్పారు. మ‌హారాష్ట్ర‌లోని న‌వీ ముంబైలో టీటీడీ నూత‌నంగా నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో త్వ‌ర‌లో మ‌హా సంప్రోక్ష‌ణ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైన సిబ్బందిని కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో నియామ‌కానికి ప్ర‌భుత్వ అనుమ‌తికై నివేదించేందుకు సిగ్నల్ ఇచ్చారు. ఒక ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ సౌరబ్ బోరా భరించేందుకు ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని  నిర్ణయాలకు ఆమోదం

  • తిరుమ‌ల‌లోని వ‌రాహ‌స్వామి విశ్రాంతి భ‌వ‌నం – 1లో రూ. 3.61 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఆమోదం.
  • తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద రూ.4.75 కోట్ల‌తో శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ హోమం కోసం యాగ‌శాల నిర్మించేందుకు నిర్ణ‌యం.
  • ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హిత డా.శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా నియమించేందుకు నిర్ణ‌యం.
  • గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండ‌లంలో ఉన్న అనంతవరంలోని వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రూ.2.71 కోట్ల‌తో రాజ గోపురం నిర్మాణానికి ఆమోదం.
  • రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలోని వెంక‌ట‌పాలెంలో ఉన్న‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రూ.36.95 కోట్ల‌తో ఏడు అంత‌స్తుల మ‌హా రాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్ధాల మండ‌పం, వాహ‌న మండ‌పం, ర‌థ మండ‌పం, శ్రీ ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం, పుష్క‌రిణి నిర్మాణానికి ఆమోదం.
  • ప్ర‌స్తుతం తిరుమలలో కార్యాల‌యాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. పాల‌నా సౌల‌భ్యం కోసం అన్ని కార్యాల‌యాల‌ను ఒకే చోటు తీసుకొచ్చేందుకు నూతనంగా పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయం.
  • సత్యసాయి జిల్లా లేపాక్షిలో నూతన కల్యాణ మండపం నిర్మించేందుకు ఆమోదం.
  • దాతల ప్రివిలేజెస్ కు సంబంధించిన విధి విధానాల ఏర్పాటు చేయడానికి టిటిడి బోర్డు సభ్యులతో కమిటి ఏర్పాటు చేసేందుకు నిర్ణయం.
  • ఖ‌మ్మంలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి తెలంగాణ ప్ర‌భుత్వం కేటాయించిన 20 ఎక‌రాల స్థ‌లాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని ఆల‌యం నిర్మించేందుకు ఆమోదం.
  • టీటీడీలో పని చేసే కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద‌రికీ శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ల‌డ్డూ కార్డు జారీ చేయాల‌ని నిర్ణ‌యం.
  • టీటీడీ ఉద్యోగుల‌కు హెల్త్ స్కీమ్ లో భాగంగా ఇప్పుడిస్తున్న రూ.3 ల‌క్ష‌ల‌కు అద‌నంగా మ‌రో రూ.2 ల‌క్ష‌ల‌ను రీఎంబ‌ర్స్మెంట్ చేసేందుకు ఆమోదం.
  • అలిపిరి టోల్ గేట్‌ వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీని త‌గ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయ‌క‌స్వామి ఆల‌య స‌మీపంలో రూ.4.25 కోట్ల‌తో బ‌స్సుల త‌నిఖీల కోసం శాశ్వ‌త షెల్ట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం.
  • ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 5000/- నుండి రూ.10,000/- కు పెంచేందుకు నిర్ణయం.
  • శ్రవణం ప్రాజెక్టులో శిక్షణ పొందుతున్న వినికిడి లోపం గల 150 మంది పిల్లలకు ఉచితంగా వినికిడి యంత్రాలు ఇవ్వాలని నిర్ణయం.