
చుట్టూ చిమ్మచీకటి.. నలువైపులా పొంచి ఉన్న ఆపద.. కళ్లముందు కన్పిస్తున్న లక్ష్యం.. సరిగ్గా ఏడాది క్రితం మన వాయుసేన ముందున్న పరిస్థితి ఇది. అలాంటి విపత్కర క్షణాల్లో మన వీర జవాన్లు సాహసం చేశారు. అర్ధరాత్రి వేళ శత్రువు రక్షణ కోటను ఛేదించి ఉగ్రమూకల స్థావరాలను తునాతునకలుగా పేల్చేశారు. ఈ తెగువతోనే ‘ఆపరేషన్ సిందూర్ ’ సమయంలో మన వాయుసేన.. దాయాది పాకిస్థాన్ వెన్నులో వణుకుపుట్టించింది.
మే 6-7 అర్ధరాత్రి వేళ మన సైన్యం.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌ను ఎలా సాగించారు? ఇందులో ఎవరు పాల్గొన్నారు? ఏయే యుద్ధ విమానాలను వాడారు? అన్న వివరాలను తొలుత ఐఏఎఫ్ భద్రతా నిబంధనల రీత్యా వెల్లడించలేదు. అయితే, గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘సిందూర్’లో పాల్గొన్న వీరులను గ్యాలంట్రీ పురస్కారాలతో సత్కరించారు. ఆ సమయంలో కేంద్రం వెలువరించిన ప్రకటనతో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కొన్ని వివరాలు బహిర్గతమయ్యాయి.
తక్కువ ఎత్తులో ప్రయాణించి..
‘సిందూర్’ సమయంలో పాక్‌లోని చాలా లక్ష్యాలపై మన బలగాలు దాడులు చేశాయి. అన్నింటికంటే ముందు పాక్ రక్షణవ్యవస్థను ఛేదించి ఉగ్రముఠాల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. సాధారణంగా ఈ స్థావరాల వద్ద పాక్ మిలిటరీ నిరంతరం పహారా కాస్తుందనే సమాచారం ఉంది. దీంతో శత్రు దేశ గగనతల రక్షణ వ్యవస్థల కంటపడకుండా ఉండేందుకు మన వాయుసేన విమానాలు అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. ఇది చాలా సవాలుతో కూడుకున్నది. ఒకవేళ రాడార్ నిఘా వ్యవస్థలు గుర్తిస్తే కింద నుంచి ఈ విమానాలను శత్రుసైన్యం లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ మన వాయుసేన యుద్ధవిమానాలు సాహసోపేతంగా ప్రయాణించాయి. తక్కువ సమయంలో పాక్ రక్షణ వ్యవస్థను ఛేదించి అత్యంత కచ్చితత్వంతో 9 ఉగ్ర స్థావరాలపై బాంబులు కుమ్మరించాయి. ఈ దాడుల్లో లష్కరే తయ్యిబా, జైషే మహ్మద్‌కు చెందిన పలు స్థావరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.
తొమ్మిది మందికి ‘వీరచక్ర’ పురస్కారాలు..
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న తొమ్మిది మంది ఐఏఎఫ్ అధికారులను కేంద్రం ‘వీర చక్ర’ పురస్కారాలతో సత్కరించింది. సుఖోయ్ 30 ఎంకేఐ, జాగ్వర్, తేజస్, మిరేజ్-2000, మిగ్-29 వంటి యుద్ధ విమానాలతో వీరు ‘సిందూర్’లో పాల్గొన్నారు.





