
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో చోటుచేసుకున్న బాలిక అత్యాచారం-హత్య ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
బాధితురాలి కుటుంబానికి న్యాయం “రికార్డు సమయంలోనే” జరిగేలా విచారణను వేగవంతం చేస్తామని సీఎం తెలిపారు. “నేను బాధితురాలి తండ్రితో రెండుసార్లు మాట్లాడాను. నిందితులకు మరణశిక్ష పడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చాను. విచారణను త్వరితగతిన పూర్తి చేస్తాం,” అని ఆయన పేర్కొన్నారు.
ప్రజల్లో ఇటువంటి ఘోర నేరాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధ ప్రక్రియల ప్రకారమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు పటిష్టంగా సాగించి, భవిష్యత్తులో నిందితులు వినియోగించుకునే లోపాలు లేకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయి అండగా ఉంటుందని హామీ ఇస్తూ, వారికి అధికారికంగా లేఖ కూడా పంపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండిస్తూ, “విమర్శించడం వారి పని అయినా, తమ పాలనలో జరిగిన తప్పులను వారు గుర్తించుకోవడం లేదు,” అని వ్యాఖ్యానించారు.
ఈ దారుణ ఘటన మే 1న పుణే జిల్లా భోర్ తాలూకాలో జరిగింది. నేర చరిత్ర కలిగిన 65 ఏళ్ల వ్యక్తి, ఆహారం ఇస్తానని నమ్మబలికి నాలుగేళ్ల బాలికను పశువుల కొట్టం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి, అనంతరం రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.





