News

800 ఏళ్ల నాటి రాజుల రహస్య భాష..

34views

రాజులు, చక్రవర్తుల కాలం నాటి రాచరిక పాలనలో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల గోప్యతను కాపాడటానికి ఉపయోగించిన 800 ఏళ్లనాటి ‘మోడీ లిపి’ మళ్లీ తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం గతేడాది మరాఠా రాణి అహిల్యాబాయి హోల్కర్‌ 300వ జయంతి సందర్భంగా మోడీ లిపిని నేర్పేందుకు పూనుకుంది. ఉజ్జయినిలోని కాళిదాస అకాడమీలో ఏప్రిల్‌ 28న ప్రారంభమైన శిక్షణ శిబిరం మే 7 వరకు కొనసాగనుంది. కొన్ని శతాబ్దాల క్రితం.. మరాఠాల పాలనలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ లిపిని వినియోగించేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, పీష్వాల పాలనలో ఇది ప్రధాన లిపిగా ఉండేది. 13వ శతాబ్దంలో హేమాద్రి పండిట్‌ దీన్ని అభివృద్ధి చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో 1960 వరకు వాడుకలో ఉండేది. ఈ లిపి రాసేటప్పుడు చేతిని కాగితం పైనుంచి పైకి లేపాల్సిన అవసరం ఉండదని ముంబయి నుంచి వచ్చిన భాషా నిపుణులు మనోజ్‌ మరాస్కోల్హే, అమోల్‌ మోహల్కర్‌ తెలిపారు. వీరే ఈ ప్రాచీన లిపిని నేర్పుతున్నారు. దీనిని నేర్చుకుంటే రాజులు రహస్య భాషలో లిఖించిన లక్షలాది పత్రాలను సమీప భవిష్యత్తులో అందరూ చదవగలిగే అవకాశం ఉంటుందన్నది వారి అభిప్రాయం.