ArticlesNews

ఆంధ్ర పదకవితాపితామహుడు అన్నమయ్య

6views

( వైశాఖ పూర్ణిమ  – అన్నమాచార్య జయంతి)

భగవంతుణ్ణి కీర్తించడంలో అన్నమయ్యను మించిన వాగ్గేయకారుడు లేడు. పరమాత్మ ధరించిన దశ అవతారాలను ఆ పదకవితాపితామహుడు తన పదాల్లో పరమ రమ్యంగా వర్ణించాడు. ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమునే నీవు..’ అంటూ ఏడుకొండలస్వామిలో సమస్త దేవతామూర్తులను దర్శించుకున్నాడు. ఆయన రచించిన శృంగార కీర్తనల్లోనూ ఆధ్యాత్మిక భావాలు పరిమళిస్తాయి. తన తదనంతర భక్తకవులు ఎందరికో అన్నమయ్య స్ఫూర్తిగా నిలిచాడు. 

‘ద్రావిడాగమ సార్వభౌమ’ అనే బిరుదు పొందిన అన్నమయ్య తెలుగులోనే గాక సంస్కృతంలోనూ ఆ దేవదేవుడి దివ్యరూపాలను వర్ణిస్తూ అపురూప కీర్తనలు రచించాడు. పరమాత్మను తొలుత సాకారంగా సేవిస్తారు భక్తులు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్న కొద్దీ రూపభేదం సమసిపోతుంది. లోకంలో ప్రతిచోటా, ప్రతిదాంట్లో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడని నిరూపించాడు అన్నమయ్య. తన సంకీర్తనల ద్వారా సామాన్య జనాన్ని సైతం పరమోన్నత స్థితికి తీసుకెళ్లాడు. ఎంతో గంభీరమైన అద్వైత తత్వాన్ని సరళమైన పదాల్లో ప్రకటితం చేశాడు.

అన్నమయ్య కడప జిల్లా తాళ్లపాకలో క్రీ.శ.1408 వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడు. తల్లి పరమభక్తురాలైన లక్కమాంబ, తండ్రి మహాపండితుడైన నారాయణసూరి. మన హృదయాలను పావనం చేసేందుకు, శ్రీనివాసుడి ఖడ్గమే (నందకం) అన్నమయ్యగా అవతరించినట్లు చెబుతారు. తాళ్లపాక గ్రామంలోని చెన్నకేశవుని ఆలయంలోనే బాల అన్నమయ్య తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాడు. తిరుమల చేరుకున్నాక అన్నమయ్య పదకవితల వైభవం సహస్రదళ పద్మమై వికసించి 32 వేల కీర్తనలుగా విరాజిల్లింది. వాటిని తాళ్లపాక వంశీయులు రాగిరేకుల మీద చెక్కించి తిరుమల ఆనందనిలయ ప్రాంగణంలోని అరలో భద్రపరిచారు. అన్నమయ్య తన కాలంలో తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేవాడని ‘దేవదేవుడెక్కెనదే దివ్యరథము..’ వంటి కీర్తనల్ని బట్టి తెలుస్తోంది. ఆయన సంకీర్తనల్లో భక్తి, సంగీతాలకు ఎంత ప్రాధాన్యత ఉందో భాషకూ, భావానికీ అంతే ప్రాధాన్యముంది. తెలుగు పల్లెపదాలకు పట్టం కట్టిన భాషావేత్త అన్నమయ్య.

 రోజుకొక కీర్తన..

భక్తి ఉద్యమాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయటంలో అన్నమయ్య ఘనమైన పాత్రను పోషించాడు. రామానుజాచార్యుల విశిష్టాద్వైత భావాల్ని తన రచనల ద్వారా సామాన్యులకు చేరువ చేశాడు. దేవదేవుణ్ణి ఆరాధించే సౌలభ్యం, ఆలపించే సౌభాగ్యం సార్వజనీనం కావాలని ఆ భక్తశిఖామణి కాంక్షించాడు. సంకీర్తనా ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఊహ తెలిసిన ప్రాయం నుంచి రోజుకొక కీర్తన రచించేవాడు. ఆయన పరమభక్తుడే అయినా సామాజిక బాధ్యతను విస్మరించలేదు. ఛాందసభావాలు, మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేశాడు. కులమతభేదాలు కూడదన్నాడు. ‘ఏ కులజుడేమి? యెవ్వడైననేమి?’ అని నిలదీస్తూ హరినెరిగినవాడే ఘనుడన్నాడు. సమకాలీన పండితులు, మతమౌఢ్యులు వ్యతిరేకించినా తన విశ్వాసాలకే కట్టుబడి ఉన్నాడు.

పరమాత్మ ఒక్కడే పురుషుడు.. మిగతా జగత్తంతా స్త్రీరూపమేనని వైష్ణవ సంప్రదాయం చెబుతోంది. దాన్నే అన్నమయ్యా అనుసరించాడు. తనను నాయికగా, ఆ భగవంతుణ్ణి నాయకుడిగా భావించుకొని రసవత్తర కీర్తనలు రచించాడు. ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అంటూ అన్ని రూపాలూ ఒకే పరబ్రహ్మను సూచిస్తాయని చెప్పకనే చెప్పాడు అన్నమయ్య. ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించినా ఆ దేవతామూర్తిలో మమేకమైపోయి కీర్తనలు రచించేవాడు. ఉదాహరణకు హంపిలోని శ్రీవిఠలనాథుడి దేవాలయాన్ని దర్శించినప్పుడు.. పరవశించి పదాలు అల్లాడు.

వ్యక్తి ఆరాధనకు వ్యతిరేకి

ప్రాపంచిక సుఖాల కోసం సాటి మనుషులను ప్రస్తుతించటం ఆత్మగౌరవానికి భంగమని అన్నమయ్య ప్రగాఢంగా నమ్మేవాడు. పరమాత్మను కీర్తించే నోటితో పరులను కీర్తించటానికి నిరాకరించేవాడు. మహారాజుల ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా, వ్యక్తి ఆరాధనకు వ్యతిరేకినని చాటుకున్నాడు. సాళువ నరసింగరాయలు ఆయనను చెరసాలలో పెట్టి హింసించినా తన నియమాలను ఉల్లంఘించలేదు.

పొట్టకూటి కోసం అక్షరాన్ని తాకట్టుపెట్టడం సరస్వతీదేవికి అపచారం చేసినట్లని ఆ సంకీర్తనాచార్యుడు మనసా వాచా నమ్మాడు. తెలుగు భాగవతాన్ని రచించిన పోతనామాత్యుల్ని తలపించాడు. ‘పరులకు కీడు తలపెట్టకపోవటమే మడి, మేలు చేయడమే ఆచారం. అందరి బాగును కాంక్షించడమే పూజ, సమదృష్టి పెంచుకోవటమే పరిణతి. సదాశయమే మంత్రం, ధర్మాచరణే తపస్సు’… ఇదీ అన్నమయ్య పదాల సారం. చంచలమైన మనసు పారమార్థిక సాధనకు అడ్డంకి అన్నాడు. మనసును నియంత్రించినవాడే ధీరుడని వెల్లడించాడు.

అయినవారూ ఆయన మార్గంలోనే..

తాను ఒక్కడే కాదు తన వారసులను కూడా ఆధ్యాత్మిక మార్గంలో మరలించిన ఆదర్శమూర్తి అన్నమయ్య. అర్ధాంగి తాళ్లపాక తిమ్మక్కలోని సాహితీతృష్ణను ప్రోత్సహించాడు. ‘సుభద్రా కల్యాణం’ వంటి భక్తికావ్యాల్ని రచించేలా ప్రోత్సహించాడు. ఆయన పుత్రులు నరసింగన్న, పెద్దతిరుమలాచార్యులు, మనవడు చినతిరుమలాచార్యులు, చిన్నన్నలు కూడా శ్రీవేంకటేశ్వరుని పరమభక్తులై సంకీర్తనా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. తాళ్లపాక వంశంలో ఏడు తరాల వరకూ భక్తకవులు జన్మిస్తారని సాక్షాత్తూ శ్రీనివాసుడు వరమిచ్చాడని ప్రతీతి. అన్నమాచార్య తన తదనంతర భక్త కవులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. పురందరదాసు, సారంగపాణి, తరిగొండ వెంగమాంబ వంటి వాగ్గేయకారులు అన్నమయ్య మార్గాన్నే అనుసరించారు.

ఆపదమొక్కులవాడి సేవలో తరించి, అమూల్యమైన భక్తిసారస్వతాన్ని భక్తజనావళికి మిగిల్చి క్రీ.శ.1503 ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు అన్నమయ్య ఆ తిరుమలేశునిలో లయమైపోయాడు.