
ఉగ్రవాదం అనేది వికృత, వక్ర మనస్తత్వం నుంచి ఉద్భవిస్తుందని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని జాతీయ భద్రతా సమస్య మాత్రమే కాదని, మానవత్వపు మూల విలువలను కాపాడటానికి చేసే యుద్ధమని ఆయన అభివర్ణించారు.
‘‘భారత్, పాకిస్థాన్‌లకు ఒకేసారి స్వాతంత్య్రం వచ్చింది. నేడు భారత్.. సమాచార సాంకేతిక రంగం(ఐటీ)కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంటే, పాక్ మాత్రం ఇంటర్నేషనల్ టెర్రరిజం (ఐటీ) అనే మరో రకం ఐటీకీ కేంద్రబిందువుగా మారింది’’ అని రాజ్‌నాథ్ ఎద్దేవాచేశారు.
ఉగ్రవాదం సైద్ధాంతిక, రాజకీయ మూలాలను కూకటివేళ్లతో పెకిలించేయాలని దిల్లీలో జరుగుతున్న ఏఎన్‌ఐ జాతీయ భద్రతా సదస్సు 2.0లో ఆయన గురువారం పిలుపునిచ్చారు. ‘‘భారత్ గడ్డపై ఉగ్రదాడులు జరిగినప్పుడు కేవలం దౌత్యపరమైన ప్రకటనలు జారీచేసే పాత ఆలోచనా విధానానికి దేశం ఇకపై కట్టుబడి ఉండదని ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపాం. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎలాంటి పరిస్థితులలోనైనా ఉగ్రవాద కార్యకలాపాలను భారత్ సహించబోదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సాయుధ దళాలు తమ సామర్థ్యాలను విస్తరించుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో కచ్చితమైన లక్ష్యాలను టార్గెట్ చేశాం. మా సామర్థ్యాలు తగ్గిపోయినందుకు కాదు. స్వచ్ఛందంగానే ఆపరేషన్ సిందూర్‌ను నిలిపేశాం. అవసరమైతే పాక్‌తో మేం సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా, ఆకస్మిక అవసరాల సమయంలో మా సామర్థ్యాలను విస్తరించే శక్తి మాకుంది’’ అని ఆయన అన్నారు. మరోవైపు, కృత్రిమమేధ (ఏఐ) తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే అనేక రంగాలను ప్రభావితం చేయగలదని, డీప్ ఫేక్‌లు, సైబర్ యుద్ధం, స్వయంప్రతిపత్తి గల ఆయుధ వ్యవస్థలు రక్షణ రంగానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయంటూ, ఏఐ వినియోగాన్ని పౌరాణిక రాక్షసుడైన భస్మాసురుడితో రాజ్‌నాథ్ పోల్చారు.





