
రాష్ట్రంలో 706 పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణపట్నంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ప్రాచీన దేవాలయ పునరుద్ధరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిపుణుల బృందంతో కలసి ఆలయాన్ని మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాబోయే రెండేళ్లలో రూ.750 కోట్లు కేటాయించి భజన మందిరాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న 43 ఆలయాలకు ప్రభుత్వం రూ.52 కోట్లు వెచ్చించిందని మంత్రి వెల్లడించారు. ఆలయాల పునర్నిర్మాణం అపూర్వమైన ఘట్టమని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం హిందూ జనోద్ధరణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆలయాల విశిష్ఠతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో దీపారాధనకు కూడా ఆలయాలు నోచుకోక పోవడం బాధాకరమన్నారు. 10, 11 శతాబ్దాల కిందట గండగోపాలపురంగా పిలువబడ్డ ఈ ప్రాంతంలో సిద్ధేశ్వర ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణం త్వరతిగతిన జరగాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఆలయాల పునర్నిర్మాణం కోసం శ్రమిస్తున్న కేంద్ర పురావస్తు శాఖ అధికారులను కూటమి ప్రభుత్వం అభినందిస్తోందని మంత్రి తెలిపారు. బ్యాంకుల్లో ఉన్న ఆలయాల ఫిక్సిడ్ డిపాజిట్లను ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయవద్దని.. ఫిక్సిడ్ డిపాజిట్ల నుంచి వచ్చే ఆదాయాలను మాత్రమే వినియోగించవచ్చని ఆనం సూచించారు.
ప్రాచీన పద్ధతుల్లోనే పునఃనిర్మాణం: సోమిరెడ్డి
శతాబ్దాల కాలంనాటి సిద్ధేశ్వర ఆలయం పునర్నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆలయాన్ని కూల్చకుండా పునర్నిర్మాణం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆలయాన్ని ప్రాచీన పద్ధతుల్లోనే పునర్నిర్మాణం చేస్తున్నారని వివరించారు. ఆలయానికి కావల్సిన నిధులు సిద్ధంగా ఉన్నాయని… దాతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.





